పాపం రైతన్న భారీ వర్షాల కారణంగా పత్తి, వరి పంటలు పూర్తిగా లాస్

 పాపం రైతన్న భారీ వర్షాల కారణంగా పత్తి, వరి పంటలు పూర్తిగా లాస్
  • దిగుబడి 20 శాతమే..
  • పత్తిని పంటను కాల్చేసి రైతు
  • మడుల్లోనే మొలకెత్తిన వడ్లు
  • పంటలు నష్టపోవడంతో ఇప్పటికే  ఇద్దరు రైతుల ఆత్మహత్య

ఆసిఫాబాద్, వెలుగు: భారీ వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. పత్తి, వరి సాగు కోసం భారీగా పెట్టుబడి రైతన్నకు కూలీల ఖర్చు గట్టెక్కేలా కూడా దిగుబడి రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. దిగుబడి రాలేదని ఇప్పటికే జిల్లాలో ఇద్దరు రైతులు సూసైడ్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. వానల ఎఫెక్ట్​తో దిగుబడి పూర్తిగా తగ్గడంతో కౌటాల మండలం ముత్యంపేటకు చెందిన రైతు గుర్లె మల్లేశ్ తాను కౌలుకు తీసుకొని పండించిన రెండెకరాల పత్తి పంట పీకేసి గురువారం కాలబెట్టాడు. మొక్కలకు పత్తి, కాయలు ఉన్నప్పటికీ దాన్ని తీస్తే ఖర్చు ఇంకా పెరుగుతుందని సదరు రైతు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిండా ముంచిన భారీ వానలు..

వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో జిల్లా రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా వరి, పత్తి పంటలపై వర్షం తీవ్రంగా ప్రభావం చూపింది. పత్తి పంట సాగుకు రైతులు ఎకరాకు రూ.60 వేల వరకు ఖర్చు చేస్తుండగా, వరి సాగుకు రూ.30 వేల వరకు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. పత్తి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే రైతుకు కొంతైనా లాభం ఉంటుంది. కానీ వర్షాల కారణంగా ఎకరాకు 3 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది.

 పత్తి ఏరే కూలీలు కిలోకు రూ.10 నుంచి రూ.12 తీసుకుంటుండడంతో ఆ కొద్దిపాటి పత్తిని తీయడం కన్నా వదిలేయడమే మేలని రైతులు భావిస్తున్నారు. చేసేదేం లేక కొందరు కుటుంబసభ్యులే కలిసి పత్తి ఏరుతున్నారు. వరి రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. చేతికొచ్చిన వరి పంట నీట మునగడంతో వడ్డన్నీ రంగు మారాయి. కేంద్రాల్లో వాటిని కొంటారో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రాణాలు తీసుకున్న రైతులు

అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు దిగుబడి వచ్చే అవకాశం లేకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్​ చేసుకుంటున్నారు. సిర్పూర్ టీ మండలం చింతకుంటకు చెందిన పిట్టల కిష్టయ్య (62) గత నెల 31న పురుగుల మందు తాగి ట్రీట్​మెంట్ పొందుతూ చనిపోయాడు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రానికి చెందిన బుట్లె సుధాకర్ (34) ఈ ఏడాది 9 ఎకరాల్లో  పత్తి సాగు చేశారు. భారీ వర్షాలు దిగుబడి పై ప్రభావం చూపడంతో  నిరాశ చెంది ఈ నెల 1న పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడు. 

పెట్టుబడి కూడా రాలేదు

రెండెకరాల చేనును రూ.24 వేలకు కౌలుకు తీసుకొని పత్తి, కంది వేశాను. వర్షాల కారణంగా పంట ఎదగలేదు. రూ.50 వేల వరకు  పెట్టుబడి పెట్టిన. రెండెకరాల్లో ఇప్పటివరకు ఆరు క్వింటాళ్ల పత్తి మాత్రమే వచ్చింది. ఇంకా పత్తి కొంచెం ఉన్నా దాన్ని తీస్తే కూలీలకే డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. అందుకే మొక్కలు తీసేసి  కాల్చివేశా.– గుర్లె మల్లేశ్, రైతు, ముత్యంపేట్, కౌటాల మండలం

మడిలోనే వడ్లు మొలకెత్తాయి

నేను రెండెకరాల్లో వరి వేశాను. కోసి ఉంచిన వరి ఇటీవల కురిసిన వర్షాలకు మొత్తం నీట మునిగింది. ఇప్పుడు పంటను బయటకు తీసేందుకు చూస్తే 70 శాతం మొలక వచ్చింది. రెండెకరాల్లో గతంలో 120 బస్తాల దిగుబడి వస్తే ఈసారి కనీసం 40 బస్తాలు కూడా వచ్చేలా లేదు. పెట్టుబడి మొత్తం నష్టపోయా. మొలకెత్తిన, నీట మునిగి రంగు మారిన వడ్లను ప్రభుత్వం కొనాలి. పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.– మానేపల్లి ధర్మారావు, రైతు, దుబ్బగూడ, సిర్పూర్ టీ మండలం