సర్కారు స్కూళ్లకు ఫ్రీ ఇంటర్నెట్..22,730 స్కూళ్లలో ఏర్పాటు.. BSNL, టీ ఫైబర్ సంస్థల ద్వారా కనెక్షన్లు ..

సర్కారు స్కూళ్లకు ఫ్రీ ఇంటర్నెట్..22,730 స్కూళ్లలో ఏర్పాటు.. BSNL, టీ ఫైబర్ సంస్థల ద్వారా కనెక్షన్లు ..

హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం బీఎస్ఎన్‌‌ఎల్, టీ ఫైబర్ సంస్థలతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పటికే చర్చలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా 26,887 సర్కారు విద్యా సంస్థలు (గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, సొసైటీ గురుకులాలు, యూఆర్ఎస్) ఉండగా, వాటిలో 24,984 బడుల్లోనే పిల్లలున్నారు. వీటిలోనూ సుమారు వెయ్యికి పైగా బడుల్లో ఎలాంటి కంప్యూటర్లు లేవు.  

దీంతో కంప్యూటర్లు ఉన్న 22,730 స్కూళ్లలో ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చేందుకు స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ చర్యలు ప్రారంభించింది. బీఎస్‌‌ఎన్‌‌ఎల్, టీ ఫైబర్ సంస్థలు మొత్తం 10,342 బడులకు ఉచితంగా ఇంటర్నెట్‌‌ కనెక్షన్లు ఇవ్వనున్నాయి. ఇందులో బీఎస్ఎన్‌‌ఎల్ 5,342 బడులకు ఫ్రీ కనెక్షన్‌‌ ఇవ్వనుండగా, ఇప్పటికే వెయ్యి బడుల్లో కనెక్షన్లు పూర్తి చేసింది. టీఫైబర్ 5 వేల బడుల్లో ఉచిత కనెక్షన్లు ఇవ్వనుంది. మరోవైపు, మిగిలిన 12,388 బడుల్లో బీఎస్‌‌ఎన్‌‌ఎల్ సంస్థ 9,404, టీ ఫైబర్ 2,984 స్కూళ్లలో డబ్బులు తీసుకొని ఇంటర్నెట్‌‌ కనెక్షన్లు ఇవ్వనుంది.

 ఈ డబ్బులను సమగ్ర శిక్ష ద్వారా విద్యా శాఖ ఆ సంస్థలకు చెల్లించనుంది. ఒకవేళ కనెక్షన్లు ఇవ్వడం ఆలస్యమయ్యే అవకాశం ఉంటే, ఇతర ప్రైవేటు కనెక్షన్లు తీసుకునేందుకు ఆయా స్కూల్‌‌ హెడ్మాస్టర్లకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వీటికయ్యే ఖర్చును కూడా స్కూల్ గ్రాంట్ నుంచి తీసుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. కాగా, ఇటీవల సర్కారు బడులకు కంప్యూటర్ ఇన్‌‌స్ర్టక్టర్లను నియామకానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఇంటర్నెట్‌‌ లేక డిజిటల్‌‌ క్లాసులకు ఇబ్బందులు..

రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరం నుంచే ఏక్ స్టెప్ ఫౌండేషన్, ఖాన్ అకాడమీ, ఫైజామ్ ఫౌండేషన్ తదితర సంస్థల సహకారంతో డిజిటల్ క్లాసులు కొనసాగిస్తున్నారు. దీనికి కంప్యూటర్లు, ఇంటరాక్టీవ్ ఫ్లాట్ ప్యానెల్స్, ట్యాబ్‌‌లు అందించినా.. ఇంటర్నెట్ సౌకర్యం ఇవ్వకపోవడంతో వీటి వినియోగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అన్ని బడుల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రతిపాదనలు పంపించారు. దీని కోసం గతేడాదికి సంబంధించిన ఐటీసీ రికరింగ్ బడ్జెట్ అందుబాటులో ఉందని, దాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని ప్రపోజల్స్‌‌లో పేర్కొన్నారు. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.