- ప్రతి పనికి పైసలు అడుగుతుండ్రు
- తరచూ ఏసీబీకి పట్టుబడుతున్న అధికారులు
- అవినీతి నిర్మూలనకు కలెక్టర్ రాహుల్ రాజ్ చర్యలు
- అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ
మెదక్, వెలుగు: జిల్లాలోని చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్య మేలుతోంది. పలు శాఖల్లో పైసలివ్వంది ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న అధికారులు, సిబ్బంది బాధ్యతతో చేయాల్సిన పనులకు సైతం బల్లకింద చేతులు చాస్తున్నారు. ఆయా పనులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు డీడీ, చలాన్ రూపంలో చెల్లించినప్పటికీ, అదనంగా తమకు డబ్బులు ఇవ్వాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్నారు.
అడిగినంత ఇవ్వకుంటే లేనిపోని కొర్రీలు పెడుతూ సతాయిస్తున్నారు. నెలల తరబడి ఆఫీస్‌ల చుట్టూ తిరిగినా పనులు చేయడం లేదు. ఈ క్రమంలో అవినీతి అధికారుల తీరుపై విసుగు చెంది బాధిత ప్రజలు, రైతులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తున్నారు. తరచుగా ఆఫీసర్లు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతూ జైలుకు వెళ్తున్నా, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు. రెవెన్యూ, విద్యుత్, పోలీస్, వైద్యారోగ్య, ల్యాండ్ సర్వే, ఎక్సైజ్ శాఖల్లో అవినీతి ఎక్కువగా జరుగుతున్నట్టు ఏసీబీ దాడుల్లో తెలుస్తోంది.
రెడ్ హ్యాండెడ్‌గా దొరికారిలా..
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లోని సర్వే ల్యాండ్ రికార్డ్ ఆఫీస్‌లో ఏడీ గంగయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్ఓ ఆఫీస్‌లో పనిచేసే ఫహీం పాషా లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మెదక్ మున్సిపల్ ఆఫీస్‌లో పనికోసం లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్జానయ్య, ప్రైవేట్ వ్యక్తి ద్వారా లంచం తీసుకున్న హవేలి ఘనపూర్ ఎస్ఐ ఆనంద్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ సురేందర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. తాజాగా ట్రాన్స్ కో మెదక్ డివిజనల్ఇంజనీర్ (డీఈ) షేక్ షరీఫ్ చాంద్ బాషా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెండ్‌గా దొరికాడు.
అవినీతి ఉద్యోగుల భరతం పడతాం : కలెక్టర్ రాహుల్ రాజ్
అధికారులు, సిబ్బంది ఎవరూ అవినీతిని పాల్పడొద్దని, అవినీతిని పూర్తిగా అంతమొందించి జిల్లాలో పారదర్శక పాలనే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో కలెక్టరేట్లో మెదక్ పట్టణంలో ఉన్న వివిధ ప్రభుత్వ విభాగాల జిల్లా, డివిజన్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా అధికారులు, సిబ్బందికి అవినీతి ఆలోచన ఉంటే విరమించుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వృత్ది పట్ల నిబద్ధత ఉండాలని, వివిధ పనుల కోసం ఆఫీసులకు వచ్చే ప్రజల పట్ల జాలి, కరుణ చూపాలన్నారు. పేదలను పీడించే అవినీతి ఉద్యోగుల భరతం పడతామన్నారు. ఉద్యోగులందరూ నీతి, నియమాలు అలవర్చుకోవాలని సూచించారు. తమ శాఖలో పేరుకు పోతున్న అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ప్రభుత్వ ఉద్యోగులేనని తెలిపారు. అధికారులందరూ ఏకధాటిగా అవినీతిపై ఉక్కు పాదం మోపాలన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం అవినీతికి పాల్పడమని అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్ఓ భుజంగరావు, మెదక్ ఆర్డీఓ రమాదేవి పాల్గొన్నారు.
