
- ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్లు చనిపోయిందన్నారంటున్న కుటుంబీకులు
- ప్రాణముందని గుర్తించి మళ్లీ హాస్పిటల్ కు..
- దుబయ్ నుంచి అంత్యక్రియలకు బయల్దేరిన కొడుకు
జగిత్యాల క్రైం, వెలుగు: ఆరు రోజుల క్రితం ఇంటి ముందు అలుకు చల్లేప్పుడు కిందపడి తలకు తీవ్రగాయమైంది. హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినా ఫలితం లేదని డాక్టర్లు చేతులెత్తేశారు. దాంతో స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మీయుల రోదనలు మిన్నంటుతున్నాయి. తీరా మరో పది నిమిషాల్లో అంత్యక్రియలు నిర్వహించే సమయంలో ఆమె శరీరంలో కదలికలు గమనించిన బంధువులు హుటాహుటిన గవర్నమెంట్దవాఖానాకు తరలించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
సారంగపూర్ మండలం రంగపేటకు చెందిన పిల్లింటి నర్సయ్య, భార్య కనకమ్మ దంపతులకు కొడుకు ఆశోక్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కనకమ్మ (50) తన ఇంటి సమీపంలో ఆరు రోజుల క్రితం అలుకు చల్లేప్పుడు ప్రమాదవశాత్తు కింద పడి తలకు తీవ్ర గాయమైంది. కుటుంబసభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. తలకు తీవ్ర గాయమవడంతో చిన్న మెదడు లో రక్తం గడ్డకట్టిందని ఆపరేషన్చేయాలని సూచించడంతో గురువారం రాత్రి ఆపరేషన్ చేయించారు. ఆదివారం సాయంత్రం బంధువులు కనకమ్మ పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీయగా చనిపోయిందని మృతదేహాన్ని తీసుకువెళ్లాలని చెప్పారని అంటున్నారు.
టెంటు వేసి.. పాడె కట్టి..
వైద్యులు చనిపోయిందని చెప్పడంతో కుటుంబీకులు కనకమ్మను ఇంటికి తీసుకెళ్లిపోయారు. కులపెద్దలకు కబురు పెట్టారు. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కనకమ్మ కొడుకు ఆశోక్ దుబయ్వలస వెళ్లాడు. తల్లి చనిపోయిందనడంతో వెంటనే స్వదేశానికి బయలుదేరాడు. ఆశోక్ తల్లిని చివరిచూపు చూసుకునేందుకు ఫ్రిజర్ సైతం తీసుకువచ్చారు. ఒకవైపు కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు, గ్రామస్థుల రోదనలతో విషాదచాయలు అలుముకున్నాయి. మరోవైపు అంత్యక్రియల కోసం టెంట్వేసి, పాడె కట్టి శవాన్ని కాల్చడానికి కట్టెలు కూడా పేర్చి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇంకో పది నిమిషాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తారనగా కనకమ్మలో కదలిక వచ్చింది. అది గమనించిన కుటుంబసభ్యులు 108 ద్వారా జగిత్యాల జిల్లా హాస్పిటల్కు తరలించారు. వెంటిలేషన్ లేకపోతే చనిపోతుందని చెప్పామని, హాస్పిటల్లో ఉంచకుండా వారే తీసుకువెళ్లారని ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్లు పేర్కొంటున్నారు. డాక్టర్లు ఆదివారం సాయంత్రం 5 గంటలకు తమ అత్త కనకమ్మ చనిపోయిందని చెప్పారని కోడలు హారిక తెలిపారు. అంత్యక్రియలు పూర్తి చేసేందుకు స్వగ్రామం తీసుకువచ్చామని, తన భర్త ఆశోక్ సైతం దుబయ్ నుంచి బయల్దేరారని అన్నారు. చివరి నిమిషంలో అత్తమ్మలో కదలికను చూసి జిల్లా ప్రధాన దవాఖానాలో చేర్పించినట్లు తెలిపారు.