బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

 బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు
  •     బల్దియా స్టాండింగ్ కమిటీకి 19 నామినేషన్లు
  •     కమిటీలో మొత్తం 15  మంది సభ్యులకే అవకాశం
  •     బీఆర్ఎస్ నుంచి 12 ,  ఎంఐఎం నుంచి 7 మంది నామినేషన్

హైదరాబాద్, వెలుగు :  బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల గడువు మంగళవారం ముగిసింది. మొత్తం15 మంది సభ్యులకుగాను19 నామినేషన్లు అందాయి. బీఆర్ఎస్​ నుంచి 12, ఎంఐఎం నుంచి 7 వచ్చాయి.  గతంలో ఎంఐఎం మద్దతులో బీఆర్ఎస్ గ్రేటర్ పీఠం దక్కించుకుంది. ఇరు పార్టీలు మ్యుచువల్ అండర్ స్టాండింగ్ తో  బీఆర్ఎస్ 8 మంది, ఎంఐఎం7 మంది సభ్యులను ఎన్నుకున్నాయి. కమిటీ రెండేండ్ల పదవీకాలం ముగిసింది.

 దీంతో మరోసారి ఎన్నుకునేందుకు నామినేషన్ల ప్రక్రియ చేపట్టగా.. బీఆర్ఎస్ నుంచి12 మంది నామినేషన్ వేశారు. ఇందులో ఎవరు విత్ డ్రా చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది. విత్ డ్రాకు వచ్చే నెల 2వ తేదీకు గడువు ఉంది. ఎవరూ చేసుకోకపోతే అదే నెల7న పోలింగ్ నిర్వహిస్తారు. గతంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం ఉండగా అంతా మాజీ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే  నడిసింది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పటికే బీఆర్ఎస్​నుంచి డిప్యూటీ మేయర్ సహా 8 మంది పార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికపై కూడా ఉత్కంఠ నెలకొంది. తమకే చాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్​కార్పొరేటర్లు పోటీ పడుతుండగా.. దక్కనివారు పార్టీ మారుతారనే ప్రచారం ఉంది.