ముగిసిన గడువు.. 3 వేల మంది నామినేషన్

ముగిసిన గడువు..   3 వేల మంది నామినేషన్
  • చివరి నిమిషం దాకా టికెట్ల పంచాది  .. ఆఖర్లో పలువురు అభ్యర్థులను మార్చిన పార్టీలు 
  • వేములవాడలో తుల ఉమను కాదని వికాస్ రావుకు బీఫామ్ ఇచ్చిన బీజేపీ
  • సంగారెడ్డిలో రాజేశ్వర్​రావు దేశ్​పాండే ప్లేసు​లో పులిమామిడి రాజు
  • రెండు చోట్ల క్యాండిడేట్లను మార్చిన కాంగ్రెస్
  • పటాన్ చెరులో నీలం మధుకు బదులు కాటా శ్రీనివాస్ గౌడ్  
  • నారాయణఖేడ్ లో సురేశ్ షెట్కార్ ప్లేసులో పట్లోళ్ల సంజీవరెడ్డి 
  • ముగిసిన నామినేషన్ల గడువు..  దాదాపు 3 వేల మంది దాఖలు 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో నామినేషన్లకు ఆఖరి రోజైన శుక్రవారం హైడ్రామా నెలకొంది. చివరి నిమిషం దాకా టికెట్ల పంచాది కొనసాగింది. పార్టీలు ఆఖర్లో పలువురు అభ్యర్థులను మార్చడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో అసలు అభ్యర్థులు ఎవరు? ఎవరికి బీఫామ్ దక్కుతుందనే ఉత్కంఠ చివరి నిమిషం దాకా కొనసాగింది. బీజేపీ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చగా, కాంగ్రెస్ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. రెండు పార్టీలు చివరి నిమిషంలో వేరే వాళ్లకు బీఫామ్​లు ఇచ్చాయి. రెండు పార్టీలు ఊహించని షాక్ ఇవ్వడంతో.. ఆయా పార్టీల అభ్యర్థులు కంగుతిన్నారు. ముందుగా తమ పేర్లు ప్రకటించడంతో అప్పటికే కొందరు నామినేషన్లు వేయగా, చివర్లో బీఫామ్ దక్కకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. టికెట్ తమకే ప్రకటించడంతో ఇన్ని రోజులు ప్రచారం చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  వీరిలో కొందరు ఇతర పార్టీల నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక కొంతమంది టికెట్ ఆశించి భంగపడ్డారు. సూర్యాపేట కాంగ్రెస్​ టికెట్​పటేల్​రమేశ్ రెడ్డి ఆశించగా, హైకమాండ్ గురువారం రాత్రి దామోదర్​రెడ్డికి కేటాయించింది. తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్ టికెట్ ఆశించగా, శామ్యూల్​కు టికెట్ దక్కింది. 


చివరి నిమిషంలో ఇద్దరు అభ్యర్థులను బీజేపీ మార్చింది. వేములవాడ, సంగారెడ్డి స్థానాల్లో మార్పులు చేసింది. మొదట వేములవాడ అభ్యర్థిగా తుల ఉమను ప్రకటించిన బీజేపీ హైకమాండ్.. బీఫామ్ మాత్రం మాజీ గవర్నర్‌‌ చెన్నమనేని విద్యాసాగర్‌‌రావు కుమారుడు వికాస్‌‌ రావుకు ఇచ్చింది. ఇక సంగారెడ్డి అభ్యర్థిగా మొదట రాజేశ్వరరావు దేశ్ పాండేను ప్రకటించింది. కానీ చివరికి పులిమామిడి రాజుకు బీ-ఫామ్ ఇచ్చింది. కాంగ్రెస్ కూడా రెండుచోట్ల అభ్యర్థులను మార్చింది. మొదట పటాన్​చెరు టికెట్ నీలం మధుకు ప్రకటించింది. అయితే మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా వ్యతిరేకించడంతో నీలం మధును మార్చింది. 
 

కాటా శ్రీనివాస్ గౌడ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక నారాయణఖేడ్‌‌ నుంచి మొదట సురేశ్‌‌ షెట్కార్‌‌కు టికెట్‌‌ ప్రకటించి, ఆయన స్థానంలో పట్లోళ్ల సంజీవరెడ్డికి చాన్స్ ఇచ్చింది. దీనిపై సురేశ్ షెట్కార్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో అగ్ర నేతలు రంగంలోకి దిగి బుజ్జగించారు. కాగా, అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థిని మార్చింది. మొదట అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్.. ఆయన స్థానంలో విజేయుడికి బీఫామ్ ఇచ్చింది. 

3 వేల మంది నామినేషన్.. 

రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసింది. గురువారం నాటికి 2,028 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, శుక్రవారం మరో 800 మందికి పైగా నామినేషన్లు వేసినట్టు తెలుస్తోంది. శనివారం నాటికి ఎంతమంది నామినేషన్లు వేశారనే దానిపై క్లారిటీ రానుంది. ఇక శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల లోపు ఆర్వో కార్యాలయానికి వెళ్లి క్యూలో ఉన్న అభ్యర్థులకు నామినేషన్ వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈసారి గజ్వేల్‌‌లో దాదాపు 190, కామారెడ్డిలో 140కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రెండు చోట్ల విద్యార్థులు, యువత, రైతులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పదుల సంఖ్యలో నామినేషన్లు వేశారు. నామినేషన్లను ఈ నెల 13న పరిశీలిస్తారు. 15 తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న కౌంటింగ్ ఉంటుంది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,399 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 456 రిజెక్ట్ అయ్యాయి.