
- కండలు పెంచేందుకు మెఫెంటెర్మిన్ సల్ఫేట్‌ను వాడుతున్న యూత్
- దీన్ని తీసుకుంటే మజిల్ గ్రోత్ ఉండదని చెబుతున్న డాక్టర్లు
- డోస్ ఎక్కువైతే హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుందని హెచ్చరిక
- ఇటీవల జిమ్‌లలో వ్యాయామం చేస్తూ కుప్పకూలుతున్న యువత
- ఆ మరణాలపై ఈ ఇంజక్షన్ ప్రభావం ఉండొచ్చంటున్న డాక్టర్లు
- సికింద్రాబాద్‌లో భారీగా మెఫెంటెర్మిన్ ఇంజక్షన్ల పట్టివేత
హైదరాబాద్, వెలుగు: కండలు తిరిగిన శరీరం కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. సిక్స్ ప్యాక్ మోజులో పడి ప్రమాదకర ఇంజక్షన్లు తీసుకుంటోంది. జిమ్‌లలో కొందరు కోచ్‌లు చెప్పే మాయమాటలు నమ్మి హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీసే ప్రమాదకరమైన మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజక్షన్లను రోజూ తీసుకుంటున్నారు. దీంతో చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్నారు. మరికొందరు సడెన్ కార్డియాక్ అరెస్టులను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా
సికింద్రాబాద్‌లో జిమ్‌లకు వెళ్లే యువతను లక్ష్యంగా చేసుకొని అక్రమంగా ఇంజక్షన్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) అధికారులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి 66 వయల్స్ టెర్మిన్, టెర్మివా (మెఫెంటెర్మిన్ సల్ఫేట్) ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంజక్షన్ల వాడకం గుండెపోటుకు దారితీస్తుందని, యువత వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవే కాకుండా స్టెరాయిడ్స్, ఇతర పౌడర్లు వాడుతూ యువత కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన కూడా పడుతున్నారు.
కండలపై మోజు.. గుండెలపై దెబ్బ..
వాస్తవానికి మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజక్షన్‌ను తీవ్రమైన గుండె జబ్బులకు, సర్జరీల సమయంలో పడిపోయిన రక్తపోటును (హైపోటెన్షన్) సాధారణ స్థితికి తీసుకురావడం కోసం పేషెంట్లకు డాక్టర్లు ఇస్తుంటారు. ఇది హార్ట్ బీట్ వేగాన్ని పెంచి, రక్తనాళాలను కుదించడం ద్వారా రక్తపోటును పెంచుతుంది. అలాంటి ప్రమాదకరమైన మందును బాడీ బిల్డర్లు శారీరక శక్తిని, బాడీని పెంచుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఇంజక్షన్ తీసుకోవడం వల్ల కండరాల పెరుగుదల ఉండదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. పైగా, డోస్ ఎక్కువైతే హార్ట్ బీట్ వేగం విపరీతంగా పెరుగుతుందని, చివరకు పంపింగ్ ఆగిపోయి హార్ట్ ఫెయిల్యూర్ కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిమ్ లలో వ్యాయామం చేస్తూ యువకులు కుప్పకూలుతున్న ఘటనల వెనుక ఈ ఇంజక్షన్ల ప్రభావం కూడా ఉండి ఉండవచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారు.
జిమ్ కోచ్‌లే సూత్రధారులు..
ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలని, ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో యువత జిమ్‌లలో చేరుతున్నారు. అక్కడ కండలు తిరిగిన సీనియర్ల బాడీలను చూసి, తాము కూడా తక్కువ సమయంలో అదే స్థాయిలో బాడీని పెంచాలని అడ్డదారులు తొక్కుతున్నారు. తమ బాడీ తొందరగా ఎలా పెంచుకోవాలని జిమ్ ట్రైనర్లను సంప్రదిస్తున్నారు. దీంతో జిమ్ ట్రైనర్లు యువతకు మాయమాటలు చెప్పి.. ఈ ఇంజక్షన్లను అంటగడుతున్నారు. వీటిని తీసుకుంటే చాలా తవక్కువ సమయంలో మజిల్ గ్రోత్ ఉంటుందని మభ్యపెడుతున్నారు. బటయ కేవలం రూ.40 నుంచి రూ.50 మధ్య దొరికే ఈ ఇంజక్షన్లను యువత అవసరాన్ని ఆసరాగా చేసుకుని రూ.500 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. అయితే, మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజక్షన్లు హాస్పిటల్ ఎటాచ్డ్ ఫార్మసీలలో మాత్రమే దొరుకుతాయి. కానీ, కొంతమంది అక్రంగా బయట మెడికల్ షాపుల్లో కూడా అమ్ముతున్నారు. ఇలాంటి మందుల కొనుగోలుకు ఆన్ లైన్ మెడిసిన్ అమ్మకాలు కూడా ప్రధాన వేదికగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. అక్రమ అమ్మకాలకు కళ్లెం వేయకుంటే మున్ముందు చాలా సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సికింద్రాబాద్ లో ఇంజక్షన్లు పట్టివేత
సికింద్రాబాద్ నామాలగుండులోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి అమ్ముతున్న మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజక్షన్లను డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖార్ఖానా పోలీసుల నుంచి వచ్చిన సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు బుధవారం ఎం. నరేశ్ అనే వ్యక్తి ఇంటిపై రెయిడ్ చేశారు. ఈ సోదాల్లో బాడీ బిల్డింగ్, స్పోర్ట్స్ లో ఉత్తేజం కోసం వాడే టెర్మిన్, టెర్మివా ఇంజక్షన్లకు సంబంధించిన 66 వయల్స్ సీజ్ చేశారు. డాక్టర్ల సూచన లేకుండా ప్రాణాంతకమైన ఈ ఇంజక్షన్లను నరేశ్ అక్రమంగా జిమ్ లకు వెళ్లేవారికి అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్‌ను అమ్మడం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం నేరమని, ఈ నేరానికి పాల్పడిన వారికి ఐదేండ్ల వరకు జైలు శిక్ష పడుతుందని డీజీ షానవాజ్ ఖాసిం హెచ్చరించారు. డ్రగ్స్ అక్రమ అమ్మకాలపై సమాచారం ఉంటే టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.
‘మెఫెంటెర్మిన్’తో మజిల్ గ్రోత్ ఉండదు
హార్ట్ సర్జరీలు చేసే సమయంలో అనస్థీషియా ఇవ్వడం వల్ల పేషెంట్లకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఆ సమ యంలో బీపీని పెంచడానికి మెఫెంటెర్మిన్ సల్ఫేట్‌ను ఉపయోగిస్తారు. కానీ, దీని వాడకం వల్ల మజిల్‌లో ఎలాంటి గ్రోత్ ఉండదు. ఎనర్జీ మాత్రమే పెరుగుతుంది. అలాగే, గుండె సమస్యలకు దారి తీస్తుంది. కార్డియాక్ అరెస్టులకు దారితీస్తుంది. జిమ్ చేసే సమయంలో సడెన్‌గా కుప్పకూలిపోవచ్చు. కొందరు జిమ్ సెంటర్ల నిర్వాహకులే ఈ డ్రగ్ ను యూత్ కు సజెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు, డ్రగ్ కంట్రోలింగ్ అధికారులు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి.
- డాక్టర్ అమరేశ్ రావు, హెచ్ఓడీ,
కార్డియో థోరాసిక్ డిపార్ట్ మెంట్, నిమ్స్ హాస్పిటల్
చట్ట ప్రకారం శిక్ష తప్పదు
యువత ఫిజికల్ ఫిట్ గా ఉండటం మంచిదే. కానీ అందుకోసం అడ్డదారులు తొక్కడమే తప్పు. ఏ డ్రగ్ దేనికి పని చేస్తుందనే సమాచారం ఆన్ లైన్ లో ఉంటుంది. ఆ మందు సైడ్ ఎఫెక్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అయినప్పటికీ, యువత ఇలాంటి ప్రమాదకర డ్రగ్స్ వాడి ప్రాణా ల మీదకు తెచ్చుకుంటున్నారు. మెఫెంటెర్మిన్ సల్ఫేట్, స్టెరాయిడ్స్ ఇలా వాడటం చట్టవిరుద్ధం. జిమ్ సెంటర్లపై డీసీఏ నిరంతరం ఫోకస్ చేస్తుంది. అక్రమంగా డ్రగ్స్ వాడుతూ దొరికితే చట్టప్రకారం శిక్ష తప్పదు. జిమ్ సెంటర్ల నిర్వాహకులు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు.
- గోవింద్ సింగ్, డ్రగ్ ఇన్ స్పెక్టర్, సికింద్రాబాద్