కిడ్నీలు ఖరాబైతున్నయ్!..క్యాన్సర్ ఆగంపట్టిస్తున్నది.. తెలంగాణలో డేంజర్ బెల్స్

కిడ్నీలు  ఖరాబైతున్నయ్!..క్యాన్సర్ ఆగంపట్టిస్తున్నది.. తెలంగాణలో డేంజర్ బెల్స్
  • మోగిస్తున్న వైద్యారోగ్యశాఖ తాజా లెక్కలు
  • భయపెట్టిస్తున్న ప్రైవేట్​ హాస్పిటల్స్​లోని ఆరోగ్యశ్రీ కేసులు
  • ఐదేండ్లలో10 లక్షలకు పైగా సూపర్ ​స్పెషాలిటీ చికిత్సలు
  • 3,63,197 కేసులతో నెఫ్రాలజీ టాప్​  
  • 3 లక్షల 6 వేల కేసులతో రెండో స్థానంలో క్యాన్సర్​
  • ఆ తర్వాత మూడు, నాలుగు స్థానాల్లో ఆర్థో, కార్డియాలజీ
  • వీటి కోసం ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్​ఆస్పత్రులకు 3 వేల కోట్ల పైగా చెల్లింపు
  • ప్రతి 25 కి.మీ.కు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కిడ్నీ, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రజలను వెంటాడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా జనం రోగాల బారిన పడుతున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్​లో నమోదైన సూపర్ స్పెషాలిటీ కేసుల వివరాల్లో ప్రజారోగ్యానికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నివేదిక ప్రకారం.. గత ఐదేండ్ల కాలంలో 10 లక్షల మందికిపైగా వివిధ సూపర్ స్పెషాలిటీ చికిత్సలు పొందారు. ఇందులో అత్యధికంగా 3,63,197 కేసుల కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో 3,06,702 కేసులతో క్యాన్సర్  కేసులు ఉన్నాయి.

 ఎముకల సంబంధిత వ్యాధులు 1,93,852 కేసులతో మూడో స్థానంలో ఉండగా, గుండె సంబంధ సమస్యలు 1,45,814 కేసులతో నాలుగో స్థానంలో ఉన్నాయి.  ఇవే కాకుండా జనరల్ మెడిసిన్, ఆప్తల్మాలజీ, న్యూరో, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఈఎన్టీ, గ్యాస్ట్రో లాంటి సూపర్ స్పెషాలిటీ కేసులు.. వేలల్లో నమోదయ్యాయి. కాగా, ప్రైవేట్​ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద నమోదుకాని కేసులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్సలనూ కలుపుకుంటే రాష్ట్రంలో ఇంతకు రెట్టింపు జనం ఆయా వ్యాధుల బారిన పడ్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. జీవనశైలిలో మార్పులు, కాలుష్యం, ఆరోగ్య అవగాహన లోపమే ఈ వ్యాధుల పెరుగుదలకు కారణమని అంటున్నారు. 

ప్రతి 25 కి.మీ.కు ఒక డయాలసిస్ సెంటర్!

మారుతున్న జీవనశైలి, అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా కిడ్నీ వ్యాధులు పెరిగిపోతున్నాయి. కేవలం ఐదేండ్ల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు హాస్పిటల్స్​లో ఆరోగ్యశ్రీ కింద 3.63 లక్షల కిడ్నీ సంబంధ కేసులు నమోదయ్యాయంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు కిడ్నీ వ్యాధుల బారిన పడుతుండడంతో లక్షల మందికి డయాలసిస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతున్నది. 

ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది.  ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 104 డయాలసిస్​సెంటర్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 70 కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తద్వారా ప్రతి 25 కిలోమీటర్ల పరిధిలో ఒక కేంద్రం ఉండేలా ప్లాన్ చేస్తున్నది. 

ఇక క్యాన్సర్ నిర్ధారణ, కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలు కూడా జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది. ఇప్పటికే ప్రతి జిల్లాకో క్యాన్సర్ డే కేర్ సెంటర్, ప్రతి 25 నుంచి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఐదేండ్లలో ఆ రోగాలకే ప్రైవేట్  హాస్పిటల్స్​కు రూ. 3వేల కోట్ల చెల్లింపులు..

రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేండ్ల కాలంలో ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 20 కీలక సూపర్ స్పెషాలిటీ సేవలకు ప్రైవేట్  హాస్పిటల్‌‌ కు మొత్తం రూ. 3,110  కోట్లు చెల్లించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, గుండె సంబంధ చికిత్సలకే ఎక్కువ శాతం నిధులు కేటాయించింది. అత్యధికంగా కార్డియాలజీ కోసం రూ. 629.74 కోట్లు, పాలిట్రామా కోసం రూ. 551.44 కోట్లు, జెనిటో యూరినరీ సర్జరీస్ కోసం రూ. 356.89 కోట్లు, నెఫ్రాలజీ  కోసం రూ. 322.98 కోట్లు, కార్డియాక్ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ కోసం రూ. 286.04 కోట్లు చెల్లించింది. 

క్యాన్సర్ చికిత్సలు కూడా ప్రభుత్వ ఖజానాపై  అధిక భారం మోపాయి. రేడియేషన్ ఆంకాలజీకి రూ. 232.88 కోట్లు, మెడికల్ ఆంకాలజీకి రూ. 117.46 కోట్లు, సర్జికల్ ఆంకాలజీకి రూ. 85.58 కోట్లు వెచ్చించింది. ఇతర స్పెషాలిటీ సేవల్లో.. తలసేమియాకు రూ. 100.88 కోట్లు, జనరల్ సర్జరీకి రూ. 90.64 కోట్లు, న్యూరో సర్జరీకి రూ. 85.59 కోట్లు, ఆప్తాల్మాలజీ సర్జరీకి రూ. 84.26 కోట్లు, పీడియాట్రిక్స్‌‌కు రూ. 77.45 కోట్లు, న్యూరాలజీకి రూ. 63.34 కోట్లు, ఆర్థోపెడిక్ సర్జరీకి రూ. 38.60 కోట్లు, గైనకాలజీ అండ్ ఆబ్‌‌ స్టెట్రిక్స్ సర్జరీకి రూ. 22 కోట్లు, పల్మోనాలజీకి రూ. 18.36 కోట్లు, ఈఎన్టీ సర్జరీకి రూ. 11.89 కోట్లు, గ్యాస్ట్రోఎంటరాలజీకి రూ. 6.94 కోట్లు,  ఆర్గాన్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ సర్జరీకి రూ. 5.53 కోట్లు చొప్పున చెల్లింపులు జరిగాయి. ఈ డబ్బులతో ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేస్తే  పేదలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. 

గ్రామీణ ప్రాంతాల్లో సూపర్​ స్పెషాలిటీ సేవలు

గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలను మరింత విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఎంత పెద్ద అనారోగ్య సమస్య వచ్చినా.. ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు చూడకుండా,  స్థానికంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే చికిత్స పొందే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇది ఒకవైపు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తూనే, మరోవైపు ఆరోగ్యశ్రీ బడ్జెట్‌‌పై ఒత్తిడిని తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. 

ఈ ఐదేండ్ల కాలంలో కిడ్నీ, క్యాన్సర్, గుండె, పాలిట్రామా తదితర 20 రకాల సూపర్ స్పెషాలిటీలకే రూ. 3,110 కోట్లు ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ కు  చెల్లించింది. ఇది కేవలం టాప్ 20 స్పెషాలిటీలకే..! ఆరోగ్యశ్రీ కింద మరిన్ని చిన్న చిన్న చికిత్సలు, టెస్టులు కూడా ఉంటాయి. వాటన్నింటినీ కలిపితే ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఇందులో ప్రధానంగా ఒక్క కార్డియాలజీ డిపార్ట్​మెంట్ కు సంబంధించే రూ. 915.78 కోట్లు ప్రభుత్వం కేటాయించడం గమనార్హం.

కీలక సూపర్ స్పెషాలిటీ విభాగాల బలోపేతానికి చర్యలు.. 

రాష్ట్రంలోని ప్రజలకు మరింత క్వాలిటీ వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ప్రధానంగా పేషెంట్ల సంఖ్య అధికంగా ఉన్న 20 స్పెషాలిటీ విభాగాలను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. నెఫ్రాలజీ, ఆంకాలజీ, ఆర్థోఫెడిక్, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ, న్యూరాలజీ, జనరల్ సర్జరీ, పిడియాట్రిక్, గైనకాలజీ, ఈఎన్ టీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ వంటి విభాగాలను ప్రభుత్వాసుపత్రుల్లో స్ట్రెంతెన్ చేయాలని భావిస్తున్నది. 

ఈ విభాగాలకు డాక్టర్లు సంఖ్య తో పాటు ఇతర స్టాఫ్​, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను కూడా పెంచనున్నారు. దీంతో పాటు ఈ విభాగాలకు పీజీ సీట్లను కూడా పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈ మేరకు సీట్ల సంఖ్యను పెంచాలని నేషనల్ మెడికల్ కమిషన్ ను కూడా కోరనున్నది. ప్రభుత్వాసుపత్రుల్లో ఈ విభాగాలు మరింత స్ట్రాంగ్ గా తయారైతే.. పేద ప్రజలకు క్వాలిటీ వైద్యం అందుతుందని సర్కార్ భావిస్తున్నది. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాలతో అధికారులు ఈ విభాగాలకు కావాల్సిన సౌకర్యాలు, స్టాఫ్​, ఎక్విప్ మెంట్, అడ్వాన్స్ డ్ టెక్నాలజీ మిషన్లు, తదితర అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు.

ఇష్టమొచ్చినట్లు యాంటీ బయాటిక్స్​ వాడొద్దు

20 ఏండ్ల కిందటి వరకు 50 ఏండ్లు దాటినవాళ్లలోనే కిడ్నీ సమస్యలు కనిపించేవి. కానీ, ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరిలో ఈ సమస్య కనిపిస్తున్నది. డయాబెటిక్​, హైపర్​ టెన్షన్​ ఉన్నవాళ్లకు కిడ్నీలు ఫెయిలవుతున్నాయి. కలుషిత ఆహారంతోపాటు డాక్టర్ల సూచనలు లేకుండా యాంటీ బయాటిక్స్​, పెయిన్​ కిల్లర్స్​ మందులను ఇష్టారీతిన వాడటమూ కిడ్నీ సమస్యలకు దారితీస్తున్నాయి.

– డాక్టర్​ భూషణ్​ రాజ్​, నిమ్స్​ సీనియర్​ నెఫ్రాలజిస్ట్​