పరేడ్‌లో విషాదం: పబ్లిక్ పైకి దూసుకెళ్లిన ఎస్‌యూవీ

పరేడ్‌లో విషాదం: పబ్లిక్ పైకి దూసుకెళ్లిన ఎస్‌యూవీ

వాషింగ్టన్: క్రిస్‌మస్ పరేడ్ చేస్తున్న వందలాది మందిపై ఓ కారు దూసుకెళ్లిన ఘటన అమెరికాలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని వాకేషాలో సాయంత్రం 4.30 గంటలకు వందలాది కలసి పరేడ్ నిర్వహిస్తుండగా.. హఠాత్తుగా ఓ ఎస్‌యూవీ రోడ్డు పైకి వచ్చింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ పరేడ్‌లో పాల్గొన్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా.. ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఎంతమంది చనిపోయారనే దానిపై ఇంకా స్పష్టమైన వివరాలు తెలియరాలేదు.

ఘటనలో గాయపడిన వారికి దగ్గర్లోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు కారకుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్ చీఫ్ డాన్ థాంప్సన్ తెలిపారు. ప్రజలపై కారు దూసుకొచ్చిన సమయంలో దాన్ని అడ్డుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని.. కాల్పులకు కూడా దిగారన్నారు. ఈ ఘటన నేపథ్యంలో వాకేషా పరిసర ప్రాంతాల్లో సోమవారం రోడ్లు, స్కూళ్లను మూసివేశారు. ఈ ఘటనపై యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ విచారం వ్యక్తం చేశారు. కేసు విచారణలో స్థానిక పోలీసులకు సహకరించాలని ఎఫ్‌బీఐని ఆదేశించారు.