సిగాచీ పరిశ్రమ ఘటన.. 39కి చేరిన మృతుల సంఖ్య

సిగాచీ పరిశ్రమ ఘటన.. 39కి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లా  సిగాచి పరిశ్రమ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది.   తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్ రావు అనే వ్యక్తి   జులై 4న కాసేపటి క్రితం మృతి చెందాడు. భీమ్ రావు స్వస్థలం మహారాష్ట్ర. 

 ఇప్పటి వరకు ఈ ప్రమాదం నుంచి  61 మంది సురక్షితంగా బయటపడ్డారు. 39 మంది మృతి చెందారు.. అందులో ఇప్పటివరకు 31 మృతదేహాలను గుర్తించారు.  ఇంకా 7 మృతదేహాలను గుర్తించలేదు. ఆస్పత్రి నుంచి ఇప్పటివరకు 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రులలో 22 మంది చికిత్స పొందుతున్నారు.  ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు అని  జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.

మరో వైపు సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  హైలెవల్ కమిటీ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది. కమిటీకి చైర్మన్ గా CS రామకృష్ణ రావు, సభ్యులుగా రెవెన్యూ, ఇండస్ట్రీ చీఫ్ సెక్రటరీలతో పాటు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైర్ డిజి, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉన్నారు. 

సంగారెడ్డి జిల్లా పాశ మైలారం సిగాచి ఫార్మా కంపెనీలో 2025, జూన్ 30న ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రియాక్టర్ పేలి దాదాపు 39  మంది వరకు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రియాక్టర్ పేలుడి ధాటికి కంపెనీ భవనం కుప్పకూలగా.. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నారు.సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. 


సిగాచీ పరిశ్రమ యాజమాన్యం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి  రూ. కోటి పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం కూడా తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం చేసింది. మూడు నెలల పాటు సిగాచీ పరిశ్రమను క్లోజ్ చేశారు.