బంగ్లాదేశ్​లో మళ్లీ హింస 99 మంది మృతి

బంగ్లాదేశ్​లో మళ్లీ హింస 99 మంది మృతి
  • ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్
  • నిరసనకారులు, రూలింగ్  పార్టీ సపోర్టర్ల  మధ్య ఘర్షణ

ఢాకా: బంగ్లాదేశ్ లో మళ్లీ హింస చెలరేగింది. ప్రధాని షేక్  హసీనా రాజీనామా చేయాలని డిమాండ్  చేస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా నిరసన  ప్రదర్శనలు చేపట్టిన ఆందోళనకారులకు, రూలింగ్  అవామీ లీగ్  మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ గొడవల్లో దేశవ్యాప్తంగా 99 మంది చనిపోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ప్రధాని హసీనా రాజీనామా చేయాలని డిమాండ్  చేస్తూ సహాయ నిరాకరణ చేస్తున్న స్టూడెంట్స్‌  మూవ్ మెంట్  ఇచ్చిన పిలుపుకు మొదటి రోజు భారీగా స్పందన వచ్చింది.

ఆందోళనల్లో పాల్గొనాలని స్కూల్స్, కాలేజీ, యూనివర్సిటీ స్టూడెంట్లు, వర్కర్లు, మదర్సా విద్యార్థులకు స్టూడెంట్స్  మూవ్ మెంట్  అంతకుముందు పిలుపునిచ్చింది. దీంతో  దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఆందోనకారులు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హసీనా వెంటనే పదవి నుంచి దిగిపోవాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల రద్దు కోసం గతంలో నిర్వహించిన ప్రదర్శనల్లో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్  చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, ప్రభుత్వ అనుకూల అవామీ లీగ్, ఛాత్రా లీగ్, జూబో లీగ్  కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. రంగాపూర్  లో నలుగురు అవామీ లీగ్  సపోర్టర్లను ఆందోళనకారులు చంపేశారు.

బంగబంధు షేక్  ముజిబ్  మెడికల్  యూనివర్సిటీ ఆవరణలో కార్లు, ఆంబులెన్స్, బైకులు, బస్సులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. చేతుల్లో కర్రలు పట్టుకొని బీభత్సం సృష్టించారు. దీంతో హాస్పిటల్ లో ఉన్న రోగులు, డాక్టర్లు, స్టాఫ్  తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హింస నేపథ్యంలో బంగ్లాదేశ్  ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అలాగే 4జీ మొబైల్  ఇంటర్ నెట్  సేవలు, ఫేస్ బుక్, వాట్సాప్,  ఇన్ స్టాగ్రామ్  సేవలపై తాత్కాలికంగా నిషేధం విధించింది.

కాగా.. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్  చేస్తూ గత నెల రోజులుగా వివిధ యూనివర్సిటీల్లో స్టూడెంట్లు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా గత నెలలో నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో హింస చెలరేగి ఆరుగురు చనిపోయారు. హింసకు బాధ్యత వహిస్తూ ప్రధాని షేక్  హసీనా రాజీనామా చేయాలని తాజాగా మళ్లీ నిరసన ప్రదర్శనలకు స్టూడెంట్స్  మూవ్ మెంట్  పిలుపునిచ్చింది. దీంతో మరోసారి హింస చెలరేగింది.

వారిని ఉక్కుపాదంతో అణచివేయండి: హసీనా

హింసపై ప్రధాని షేక్  హసీనా సీరియస్  అయ్యారు. ఆందోళన చేస్తున్న వారు స్టూడెంట్లు కాదని, వారు టెర్రరిస్టులని ఆమె మండిపడ్డారు. వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని దేశ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. హింస నేపథ్యంలో భద్రతా వ్యవహారాల నేషనల్  కమిటీతో ఆమె అత్యవసర సమావేశం నిర్వహించారు. దేశంలో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అలర్ట్ గా ఉండాలని ఇండియన్లకు సూచన

బంగ్లాదేశ్ లో హింస నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఇండియన్లను భారత ఎంబసీ హెచ్చరించింది. ఏమైనా సాయం అవసరమైతే ఇండియా అసిస్టెంట్  హై కమిషన్ ను సంప్రదించాలని ఎంబసీ అధికారులు సూచించారు. ఎమర్జెన్సీ ఉంటే అసిస్టెంట్  హై కమిషన్  ఫోన్  నంబర్ 88- 01313076402ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ మేరకు అసిస్టెంట్  హై కమిషన్  ట్విట్టర్ లో ఒక ప్రకటన పోస్టు చేసింది.