హాలోవీన్​లో తొక్కిసలాట..153కు చేరిన మృతులు

హాలోవీన్​లో తొక్కిసలాట..153కు చేరిన మృతులు

ఆస్పత్రుల్లో మరో 133 మంది.. వీరిలో 37 మందికి సీరియస్

వేలాది మంది మిస్సింగ్ 

మృతుల్లో 20 మంది ఫారినర్లు 

సంతాపం ప్రకటించిన ప్రపంచ దేశాల లీడర్లు

సియోల్ : సౌత్​కొరియా రాజధాని సియోల్ లో జరిగిన హలోవీన్ ఫెస్టివల్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 153కి చేరింది. గాయపడిన 133 మంది ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. వీరిలో 37 మంది కండిషన్ సీరియస్ గా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. చనిపోయినోళ్లలో 97 మంది మగవాళ్లు, 56 మంది ఆడవాళ్లు ఉన్నారని అధికారులు ఆదివారం చెప్పారు. వీరిలో ఎక్కువ మంది టీనేజ్ పిల్లలు, యువతే ఉన్నారని తెలిపారు. మృతుల్లో  కనీసం 20 మంది విదేశీయులు ఉన్నారని.. వారిలో చైనా, రష్యా, ఇరాన్, అమెరికా తదితర దేశాల వారున్నారని వెల్లడించారు. వీళ్ల డెత్ పై ఆయా దేశాల ఎంబసీలకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు.

సియోల్ లోని 42 ఆస్పత్రుల్లో డెడ్ బాడీలను భద్రపరిచామన్నారు. తొక్కిసలాట కారణంగా వేలాది మంది మిస్సయ్యారు. తమ వాళ్లు గాయపడ్డారో, చనిపోయారో తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లందరూ ఆస్పత్రులకు క్యూ కట్టారు. తమ వాళ్ల ఆచూకీ తెలియడం లేదని 2,600 మందికి పైగా బంధువులు అధికారులకు ఫోన్లు చేశారు. కొంతమంది ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి ఆరా తీశారు. కాగా, సియోల్ లోని ఫేమస్ మార్కెట్ ఇటావోన్ లో శనివారం రాత్రి జరిగిన హలోవీన్ వేడుకలకు లక్ష మందికి పైగా హాజరయ్యారు. అక్కడి ఇరుకు సందులోకి ఒక్కసారిగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. 

వారం రోజులు సంతాప దినాలు... 
ఈ ప్రమాదంపై సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన టీవీలో మాట్లాడారు. వారం రోజులు సంతాప దినాలు ప్రకటించారు. ప్రభుత్వ ఆఫీసులపై జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆదేశించారు. గాయపడినోళ్లకు మెరుగైన ట్రీట్​మెంట్ అందించాలని, చనిపోయినోళ్ల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని, బాధిత కుటుంబాలకు సాయం అందించాలని చెప్పారు. ప్రమాదానికి కారణాలపై విచారించి, మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి ఆయన పరిశీలించారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాల లీడర్లు దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.

మన విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని ట్రూడో, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్, జర్మనీ చాన్స్ లర్ ఓలాఫ్ స్కాల్జ్, సింగపూర్ ప్రెసిడెంట్ హలిమా యాకోబ్ సంతాపం ప్రకటించారు.