మిజోరంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 29కి చేరిన మృతుల సంఖ్య

మిజోరంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 29కి చేరిన మృతుల సంఖ్య

  ఐజ్వాల్ : మిజోరంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య పెరిగి 29 కు చేరుకుంది. మరో ఏడుగురు ఆచూకీ ఇంకా తెలియలేదు. వారు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 25 మంది మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మెతుంలో రాతి క్వారీ కూలిన ఘటన స్థలంలో నలుగురి డెడ్ బాడీలను కనుగొన్నారు. దీంతో మరణించిన వారి సంఖ్య 29కు చేరుకుంది. మృతుల్లో 23 మంది మిజోరం వాసులు కాగా, ఐదుగురు జార్ఖండ్, ఒకరు అస్సాంలోని సిల్చార్ పట్టణానికి చెందినవారు. 

గల్లంతయిన వారి ఆచూకీని కనుగొనడానికి సెర్చ్ ఆపరేషన్ లాంచ్ చేశామని ఐజ్వాల్ డిప్యూటీ కమిషనర్ నజుక్ కుమార్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు మిజోరం సీఎం లాల్‌‌‌‌దుహోమా రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లను కేటాయించిందన్నారు. కాగా, వాతావరణ పరిస్థితులు బాగా లేవని ఐఎమ్ డీ హెచ్చరించడంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూసివేయాలని మిజోరం ప్రభుత్వం ఆదేశించింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్, అత్యవసర సేవలు అందించే వారు విధులు నిర్వహించాలని పేర్కొంది.