
- ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, ఏపీ నీళ్ల దోపిడీపై చర్చకు రావాలంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు
- చర్చిద్దామంటూ ప్రెస్‌క్లబ్‌కు వెళ్లిన కేటీఆర్, బీఆర్ఎస్ లీడర్లు
- సీఎం రేవంత్ కోసమంటూ కుర్చీ ఏర్పాటు
- అదే సమయంలో అసెంబ్లీకి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, కాంగ్రెస్ నేతలు
- చర్చకు రమ్మన్నది నిన్ను కాదు.. మీ నాయనను: పీసీసీ చీఫ్
- అసెంబ్లీకి రమ్మంటే తప్పించుకు తిరుగుతున్నారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల వార్ ముదిరింది. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, ఏపీ నీళ్ల దోపిడీపై చర్చకు రావాలంటూ ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి.. ‘చర్చకు కేసీఆర్ అక్కర్లేదు.. నేను చాలు’ అని అన్నారు. ఆ అంశాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు.
ఈ మేరకు మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్‌ను తీసుకుని కేటీఆర్ ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కోసం కుర్చీ వేసి.. చర్చకు రావాలంటూ డిమాండ్‌చేశారు. దీనికి కౌంటర్‌గా అదే టైమ్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే బీఆర్ఎస్ నేతలు తప్పించుకుతిరుగుతున్నారని ఫైర్ అయ్యారు.
కేటీఆర్‌కు కాంగ్రెస్ కౌంటర్..
ఉదయం 10 గంటల నుంచే బీఆర్ఎస్ నేతలు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకోవడం ప్రారంభించారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భవన్‌కు వెళ్లిన కేటీఆర్.. అక్కడి నుంచి 11 గంటలకు ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్ కోసం కుర్చీ ఏర్పాటు చేశారు. తనతో చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. సీఎం రావడం వీలుకాకపోతే కనీసం మంత్రులనైనా పంపించాలంటూ డిమాండ్‌చేశారు. అదే సమయంలో అసెంబ్లీలోని సీఎల్పీలో కాంగ్రెస్‌నేతలు కేటీఆర్‌కు కౌంటర్ఇచ్చారు. కేటీఆర్‌ను చర్చకు పిలవలేదని, సీఎంతో చర్చించే స్థాయి ఆయనకు లేదని విమర్శించారు. కేసీఆర్‌ను చర్చ కోసం అసెంబ్లీకి తీసుకురావాలంటూ సవాల్‌చేశారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకుతిరుగుతున్న దొంగలంటూ కేసీఆర్, కేటీఆర్‌పై మండిపడ్డారు.
సీఎం వర్సెస్ కేటీఆర్..
18 నెలల పాలనలోనే అన్నింటినీ గాడిలో పెడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో చెప్పారు. ఒక్క ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, రైతు భరోసా ఇస్తున్నామని, సన్నొడ్లకు రూ.500 బోనస్ఇస్తున్నామని తెలిపారు. ఏపీకి నీళ్లు దోచిపెట్టింది కేసీఆరేనని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, ఏపీ నీళ్ల దోపిడీపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. అయితే, ఈ నెల 5న సీఎం రేవంత్‌కు కేటీఆర్ప్రతిసవాల్విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించేందుకు కేసీఆర్అవసరం లేదని, తాను సరిపోతానని అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలంటూ ప్రతిసవాల్చేశారు. రైతులను సంక్షోభంలోకి నెట్టారని, కేసీఆర్ఇచ్చిన నోటిఫికేషన్లకు అపాయింట్మెంట్లెటర్లు ఇచ్చి తామే ఉద్యోగాలిచ్చినట్టుగా ప్రకటనలు గుప్పించుకుంటున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇటు ప్రెస్‌క్లబ్, అటు అసెంబ్లీ వేదికగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.