
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దశాబ్ది ఉత్సవాల టాస్క్!
- ఎన్నికల టీంలో ఉండేదెవరో తేల్చేది ఈ 21 రోజులే
- ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా టికెట్ కట్
- రంగంలోకి ఇంటెలిజెన్స్, ప్రైవేట్ ఏజెన్సీలు
హైదరాబాద్, వెలుగు: అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల టాస్క్ఇచ్చారు. గతంలో రైతుబంధు సంబురాలు, ఆత్మీయ సమ్మేళనాలను లైట్ తీసుకున్న ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడానికి ఆ రెండు సందర్భాలను ఉపయోగించుకోవాల్సింది పోయి నిర్లక్ష్యం చేస్తారా? అని పలు సందర్భాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఐదారు నెలల సమయమే ఉండటంతో దశాబ్ది ఉత్సవాలతో ఎన్నికల ప్రచారం షురూ చేస్తున్నారు. పేరుకు అధికారిక కార్యక్రమాలే అయినా వచ్చే ఎన్నికల్లో ఓట్లు దక్కించుకోవడమే ధ్యేయంగా ఈ వేడుకలకు తెరతీశారు. ఈ వేడుకల నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ల టికెట్లు కట్‌చేయాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల టీంలో ఎవరెవరు ఉంటారు? ఎవరిని తప్పిస్తారనేది ఈ 21 రోజుల్లో వారి పనితీరు ఆధారంగానే నిర్దారించనున్నట్టు సమాచారం. దశాబ్ది ఉత్సవాల నిర్వహణను సీరియస్‌గా తీసుకున్న బీఆర్ఎస్చీఫ్.. ఇంటెలిజెన్స్‌తో పాటు పలు సంస్థలను రంగంలోకి దించి రోజువారి నివేదికలు తెప్పించుకోనున్నట్లు తెలిసింది.
సిట్టింగులకే టికెట్లు.. కండీషన్స్ అప్లయ్
రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ప్రభుత్వం కన్నా ఎక్కువగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో చేస్తున్నా దానిని సరిగా చెప్పుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సంయుక్త సమావేశంలో తేల్చిచెప్పారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఉపేక్షించేది లేదని, ప్రజల్లోకి వెళ్లి ఎవరైతే గట్టిగా పనిచేస్తారో వాళ్లకు మాత్రమే టికెట్లు ఇస్తామని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వాళ్లను మాత్రమే కాదు పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ముంచుతుందని ఆ మీటింగ్‌లో కేసీఆర్ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో తాను ఏం చేయబోతున్నది ముందే చెప్పేశారు. సిట్టింగులకే టికెట్లు ఇస్తామంటూనే కండీషన్స్ అప్లయ్ అంటూ మెలిక పెట్టారు. ఎమ్మెల్యేలను మూడు కేటగిరీలుగా విభజించారు. ప్రజలతో టచ్‌లో ఉంటూ, పాజిటివ్ టాక్ఉన్న వారికి ఏ గ్రేడింగ్ఇచ్చారు. తర్వాత రెండు కేటగిరీలకు బీ, సీ గ్రేడింగ్ఇచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏ రోజు, ఏం చేయాలనేది ముందే నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారా? లేదా? అనేది మానిటరింగ్ చేయనున్నారు. ప్రగతి భవన్ కేంద్రంగా కొందరు ఎమ్మెల్సీలు ఈ డైలీ రిపోర్టు తెప్పించుకుంటారని, ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర సంస్థలు ఇచ్చే నివేదికలను యాథాతథంగా కేసీఆర్‌కు అందజేస్తారని సమాచారం.
రైతుబంధు సంబరాలు అంతంతే
రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు రైతుబంధు మొత్తం జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబురాలు చేయాలని సీఎం ఆదేశించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు దీనిని లైట్ తీసుకోవడంతో ఇంకో వారం గడువు పొడిగించారు. అయినా, ఆశించిన స్థాయిలో ఈ సంబురాలు జరగలేదు. ఆ తర్వాత పార్టీ క్యాడర్ మొత్తాన్ని ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారు. పార్టీలో సభ్యత్వం ఉన్న 60 లక్షల మందిని వీటిలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో మొత్తం 50 లక్షల మంది పాల్గొన్నట్టు ప్రగతి భవన్‌కు నివేదికలు అందాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న వాళ్లందరూ సభ్యత్వం ఉన్న కార్యకర్తలు కాదని కూడా రిపోర్ట్లు ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ క్యాడర్‌తో అనేక మంది ఎమ్మెల్యేలకు సత్సంబంధాలు లేవు. కొందరు ఎమ్మెల్యేలు తమ వర్గం వారిని తప్ప మిగతా వాళ్లని దగ్గరికి రానివ్వట్లేదు. ఇది వచ్చే ఎన్నికల్లో పార్టీకి చేటు తెస్తుందని కేసీఆర్ ఇటీవల హెచ్చరించారు. సాధారణ కార్యకర్త చెప్పింది కూడా ఎమ్మెల్యేలు వినాలని, తాను ఈ విషయం పలుమార్లు చెప్పినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఇటీవల క్లాస్ పీకారు. మారకుంటే మార్చేస్తానని తీవ్రంగానే హెచ్చరించారు.
జూన్ నెలాఖరుకు నివేదికలు సిద్ధం
తెలంగాణ ఏర్పడి పదేళ్లవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకుని, ప్రజలతో మళ్లీ ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశంతో 21 రోజుల పాటు ఉత్సవాలకు రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఉత్సవాలు చేసి తీరాలి. ఎక్కడైనా అనుకున్న స్థాయిలో ఉత్సవాలు చేయకపోతే అది ఎమ్మెల్యే ఫెయిల్యూర్‌గానే పరిగణిస్తారు. ఆ నివేదికనే ఎప్పటికప్పుడు ప్రగతి భవన్‌కు అందిస్తారు. ఇందుకోసం ఒక్క ఇంటెలిజెన్స్‌పైనే ప్రభుత్వం ఆధారపడటం లేదు. పలు ప్రైవేటు ఏజెన్సీలను కూడా రంగంలోకి దించుతోంది. ఆయా సంస్థలు ఇచ్చే సర్వే రిపోర్టుల ఆధారంగా జూన్ నెలాఖరుకు నివేదికలు సిద్ధం చేస్తారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ఉన్న గ్రేడింగ్‌తో ఆయా రిపోర్టులను సరిపోల్చుతారు. పనితీరు మార్చుకొని ప్రజలకు చేరువైన ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో కొనసాగిస్తారని, గతంలోని సర్వేల్లోనే సీ గ్రేడ్‌లో ఉండి.. దశాబ్ది ఉత్సవాల నిర్వహణలోనూ ఫెయిల్అయితే వారిని తప్పించడం ఖాయమని ప్రగతి భవన్‌కు సన్నిహితంగా ఉండే ఒక నాయకుడు చెప్పారు.