
- మహబూబ్ నగర్ పరిశోధన కేంద్రంలో కేవలం 400 మిగిలాయి
- రోగాలు తట్టు కుంటది..టేస్టీ మటన్‌కు పెట్టింది పేరు
- మార్కెట్లో డిమాండ్ ఉన్నా..పొట్టి రూపమే పెద్ద శాపమైంది
దక్కన్ గొర్లు.. సొంత గడ్డ తెలంగాణలోనే అంతరించిపోయే దశకు చేరుకున్నయి. పరిశోధన స్థానాల్లో తప్ప బయట కాపరుల మందల్లో ఎక్కాడా కనవడుతలేవ్. కొమ్ములు తిరిగిన ఈ పొట్టేళ్లు టేస్టీ మటన్‌కు పెట్టింది పేరు. ఏటా రెండు సార్లు నాణ్యమైన ఉన్ని ఇస్తయి. గట్టి గిట్టలుండంతో రాళ్లురప్పలు, వానలు, బురదలో రోజంతా తిరిగినా తట్టుకుంటయి. రోగనిరోధక శక్తి ఎక్కువ. కరవు, ఎండ తట్టుకోగలవు. అయితే ఇతర జాతుల కంటే కొంత పొట్టిగా కనవడడమే ఈ జాతికి పెద్ద శాపమైంది. మార్కెట్లో వాటికంటే కొంత రేటు తక్కువ పలుకుతుందని పెంచడం తగ్గించారు. దీంతో క్రమంగా తగ్గపోయి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ పరిశోధన కేంద్రంలో కేవలం 400 గొర్రెలున్నాయి. అక్కడ వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు.
మన పోట్టేళ్లు మహగట్టివి…
మన దక్కన్ జాతి గొర్రె… ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా పెరుగుతుంది. దేశంలో 45 రకాల బ్రీడ్లతో పోలిస్తే దక్కన్ జాతి గొర్రెలు చాలా గట్టివి. 45 డిగ్రీల ఎండను తట్టుకుంటాయి. కరవు పరిస్థితుల్లో ఎండుగడ్డి.. తుమ్మకాయలు తిని జీర్ణించుకుని బతకగల శక్తి ఉంది. రోగనిరోధక శక్తి ఎక్కువ. గిట్టలు చాలా గట్టిగా ఉంటాయి. రాళ్లురప్పలు, గుట్టల్లో చురుగ్గా తిరగ్గలదు. వాన, బురదతో ఒక రోజంతా నిలబడినా వీటికి ఏం కాదు. గిట్ట గట్టిగా ఉండటం వల్ల కాళ్లు దృఢంగా ఉంటాయి కానీ ఎత్తు తక్కువగా ఉంటయి. అదే మిగితా గొర్రెలకు గిట్టలు మెత్తబడి…వెంటనే పుండ్లు పడుతయి. బొబ్బ రోగం, గాలికుంటు వ్యాధి, ఎంట్రోటాక్సిమియా లాంటి ప్రమాద కర జబ్బులు తట్టుకుని బతుకుతాయి. మూడు నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులు ఇస్తే వాటి వల్ల కలిగే డ్యామేజీని తట్టుకోగలుగుతాయి. తక్కువ ఖర్చుతోనే దాణా వేయకున్నా బీడు పొలాల్లో, గుట్టల్లో ఎండుగడ్డి తిని పెరుగుతాయి.
కొమ్ములు తిరిగి నల్లగ నిగనిగలాడే ఉన్నితో బలిష్టంగా ఉంటాయి. ఏటా రెండు సార్లు నాణ్యమైన ఉన్ని ఇస్తాయి. మిగతా జాతుల గొర్రెలకు ఉన్ని ఏటా ఒకసారి రావడం కూడా కష్టమే. మార్కెట్లో వీటి ఉన్ని కూడా మంచి రేటు ఉండేది. గొంగళ్లు, బ్లాంకెట్లు తయారు చేసేవారు. అయితే సింథటిక్, పాలిథిన్ రగ్గులు పెరగడంతో ప్రస్తుతం ఉన్నికి డిమాండ్ తగ్గింది. అలాగే ఉన్ని కత్తిరించి, మార్కెట్ తీసుకొచ్చి అమ్మడంపై ఇప్పటి కాపరులకు కూడా ఆసక్తి తగ్గింది.
నెల్లూరు బ్రీడ్, ఇతర రాష్ట్రాల గొర్రెలు డెక్కన్ కంటే కొంత ఎత్తుగా కనిపిస్తాయి. ఏడాది రాగానే దాదాపు24 కేజీల బరువు తూగుతుంది. దక్కన్ పొట్టేళ్లు కూడా ఏడాదిలో 24 కిలోల వరకు బరువు పెరుగుతాయి. వీటి మటన్ కూడా ఇతర బ్రీడ్ల మటన్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ రెండింటిని పక్కపక్కన పెట్టి చూస్తే కాళ్లు చిన్నగా ఉండడంతో దక్కన్ పొట్టేలు కొంత పొట్టిగా కనిపిస్తుంది. మార్కెట్లో నెల్లూరు జాతి కంటే కొంత రేటు తక్కువ పలుకుతోంది. దీంతో గొర్రెల కాపరులు దక్కన్ గొర్రెలు పెంచడం తగ్గించారు. ఎక్కువ లాభం వస్తుందని ఇతర బ్రీడ్ల గొర్రెలు పెంచుతున్నారు. కాపరుల్లో నిరక్షరాస్యులు ఎక్కువ. దీనిపై పశుసంవర్థక శాఖ అధికారులు కానీ, వెటర్నరీ డాక్టర్లుగా వారికి ఎలాంటి అవగాహన కల్పించడం లేదు. దీంతో ఇప్పుడు మన రాష్ట్ర గొర్రెలు ఎక్కడా కనిపించకుండా పోయాయి.
జాతిని కాపాడుకోవాలి
దక్కన్ గొర్రెలు తెలంగాణకు చెందిన మేలైన జాతి. మన రాష్ట్రంలోని పరిస్థితిని తట్టుకొని మనగలిగే ఈ బ్రీడ్‌ను కాపాడుకోవాలి. దీనివల్ల కలిగే లాభాలను పెంపకందారులకు చెప్పాలి. జాతిని అంతరించిపోకుండా చూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 400 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. వాటిని మహబూబ్‍నగర్‍లోని మా పరిశోధన కేంద్రంలో సంరక్షిస్తున్నాం. పెంచాలని ఆసక్తి ఉన్న వారు వస్తే సబ్సిడీపై పొట్టేళ్లు, గొర్లు ఇస్తాం. పెంపకంలో ఎలాంటి అనుమానాలున్న నివృత్తి చేస్తాం.
-డా కే వెంకటరమణ, ప్రొఫెసర్, వెటర్నరీ యునివర్సిటీ