కేంద్రం తన వైఖరి చెప్పినా  ఆగని తీర్మానాలు

కేంద్రం తన వైఖరి చెప్పినా  ఆగని తీర్మానాలు

మహబూబ్​నగర్​, వెలుగు : యాసంగి వడ్లను కేంద్రమే కొనాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు సహా అన్ని లోకల్​బాడీస్​లో రెండు, మూడు రోజులుగా తీర్మానాలు చేస్తున్నారు. ఇటీవల మంత్రుల ఢిల్లీ టూర్​లోనే కేంద్రం తన వైఖరి చెప్పిన నేపథ్యంలో లోకల్​బాడీస్​ తీర్మానాలతో ఎలాంటి లాభం లేదని టీఆర్ఎస్​ మంత్రులు, ఎమ్మెల్యేలు అభిప్రాయానికి వచ్చారు. ఒక దశలో క్యాన్సిల్​ చేద్దామనుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ ​ఆదేశాలు కనుక ఆయనను అడిగే ధైర్యం చేయలేక మానుకున్నారు. ఈ క్రమంలో తీర్మానాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అఫీషియల్​గానే రూ.5 కోట్ల జనరల్​ ఫండ్స్​ ఖర్చు చేస్తున్నారు. 

రా రైస్​ తీసుకుంటామన్న కేంద్రం.. 
రాష్ట్రం నుంచి యాసంగి వడ్లను రా రైస్​గా ఇస్తే తీసుకుంటామని కేంద్రం చెబుతుండగా, బాయిల్డ్​ రైస్​ తీసుకోవాలని మొన్నటి దాకా రాష్ట్ర సర్కారు డిమాండ్ ​చేసింది. కానీ గతంలో బాయిల్డ్​ రైస్​ ఇవ్వబోమని అగ్రిమెంట్​ చేసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పైగా బాయిల్డ్​ రైస్​మిల్లర్ల ప్రయోజనం కోసమే ప్రభుత్వ పెద్దలు కేంద్రాన్ని ఇరుకునపెడ్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఉన్నట్టుండి మాటమార్చారు.  కేంద్రం రైస్​ కాకుండా నేరుగా వడ్లే కొనాలని డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకని ఇటీవల రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లగా కేంద్రం తన వైఖరి స్పష్టంగా చెప్పింది. బాయిల్డ్​ రైస్​ ఎవరూ తినడం లేదని, అందువల్ల దేశమంతా తీసుకున్నట్లే తెలంగాణ నుంచి కూడా రా రైస్​ తీసుకుంటామని కేంద్ర మంత్రి పియూష్ ​గోయల్​ స్పష్టం చేశారు. దీంతో  తెలంగాణ మంత్రులు ఏమీ చేయలేక తిరిగివచ్చారు. మంత్రుల టూర్​కు ముందే వారం రోజుల కింద మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లతో సీఎం కేసీఆర్​ హైదరాబాద్​లో ఇదే అంశంపై మీటింగ్ పెట్టారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్​లు, మున్సిపాలిటీలు, మార్కెట్​కమిటీలు, పీఏసీఎస్​లలో పాలకవర్గాల మీటింగులు నిర్వహించి, తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని ఆదేశించారు. 

తీర్మానాలకు రూ.5కోట్ల ఖర్చు.. 
నిజానికి రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో నెల, రెండు నెలల కిందే జిల్లా పరిషత్​, మండల పరిషత్, మున్సిపల్​ సమావేశాలు ముగిశాయి. మళ్లీ 90 రోజుల తర్వాత వాటిని నిర్వహించాలి. కానీ కేవలం సీఎం సార్​ చెప్పిండని రెండు రోజులుగా గ్రామ సభలు, మండల పరిషత్​, జిల్లా పరిషత్, ​కార్పొరేషన్​, మున్సిపాలిటీలు​, ప్రాథమిక సహకార సంఘాలు, వ్యవసాయ మార్కెట్​ కమిటీల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలో రెండు రోజుల నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కాగా, మిగతా జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందు కోసం రాష్ర్ట వ్యాప్తంగా రూ.5 కోట్ల జనరల్​ ఫండ్స్​ను కేవలం తీర్మానాల కోసం ఖర్చు చేస్తున్నారు. రాష్ర్టంలో 12 వేల గ్రామ పంచాయతీలు ఉండగా, ఒక్కో గ్రామ పంచాయతీ సభ నిర్వహణ కోసం రూ.2వేల చొప్పున 12 వేల గ్రామ పంచాయతీల్లోనే రూ.2.40 కోట్లు ఖర్చు చేస్తున్నారు.   538 మండల పరిషత్​లకు రూ.10 వేల చొప్పున, 814 పీఏసీఎస్​ల్లో రూ.8 వేల చొప్పున,  45 మార్కెట్​ కమిటీల్లో  రూ.5 వేల చొప్పున, 141 మున్సిపాలిటీల్లో రూ.10 వేలచొప్పున,  33 జడ్పీ సమావేశాల్లో  రూ.1.50 లక్షలు చొప్పున..ఇలా ఏం తక్కువ రూ.5 కోట్ల జనరల్​ ఫండ్స్​ ఖర్చు చేస్తుండడం గమనార్హం.