చెరువులో చేపలు మాయమవటం హాట్ టాపిక్ గా మారింది

చెరువులో చేపలు మాయమవటం హాట్ టాపిక్ గా మారింది

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం బుద్ధారం చెరువులో చేపలు మాయమవటం హాట్ టాపిక్ గా మారింది. చెరువులో వదిలిన చేప పిల్లలు కనిపించకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. ఏడాది కాలంలో చెరువులో చేపల సంఖ్య బాగా తగ్గి పోవటం మిస్టరీగా మారింది. దీంతో అయోమయంలో పడ్డ మత్స్యకారులు తమకు జరుగుతున్న నష్టాన్ని అధికారులకు వివరించారు. దీంతో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

చెరువులో ఉన్న చేపలు.. చేప పిల్లలను తింటున్నాయని మత్స్యశాఖ అధికారులు చెప్పటంతో ఆశ్చర్యపోయారు. వాటిని దయ్యం చేపలు లేదా అమెజాన్ సెయిల్పిన్ కాట్ ఫిష్ అంటారు. స్థానికంగా దయ్యం చేపలు, బల్లి చేపలని పిలుస్తుంటారు. ఇవి అలంకరణ కోసం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఒక రకం క్యాట్ ఫిష్ లు అని మత్స్యశాఖ అధికారులు అంటున్నారు. అక్వేరియంలో పేరుకు పోయే నాచును తొలగించటం వీటి పని. ఇతర చేపపిల్లలను తినేస్తుంటాయి. అందువల్ల పెద్దవి అయ్యేలోపే అక్వేరియం నిర్వాహకులు వీటిని చంపేయడమో లేదంటే రిజర్వాయర్లలో విడిచి పెట్టడమో చేస్తుంటారు. అలా ఎవరో దయ్యం చేపలను వదిలించుకున్నపుడు వాటి సీడ్ కూడా చేరి వాటి సంఖ్య పెరిగి ఉండొచ్చని అధికారులంటున్నారు.

బుద్ధారం చెరువులో పట్టుబడిన అమెజాన్ సెయిల్ఫిన్ క్యాట్ ఫిష్ లు చెరువులో ఉన్నంత కాలం ఒక్క చేప కూడా మిగలదు. వీటిని వదిలించుకోవాలంటే చెరువును ఎండబెట్టాలని లేదా చేపలన్నింటినీ  పట్టేశాక నిపుణుల సలహాతో చెరువులో బ్లీచింగ్ కలపాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.