పూడిక రావట్టె..గేట్లు మొరాయించవట్టె..!

పూడిక రావట్టె..గేట్లు మొరాయించవట్టె..!

గేట్లు ఎత్తేటప్పుడు సమస్యలు 
నిధులు ఇవ్వని రాష్ట్ర సర్కారు
'డ్రిప్' కింద ఫండ్స్​ ఇచ్చేందుకు కేంద్రం రెడీ 
రాష్ట్రంలో 29 ప్రాజెక్టుల ఎంపిక 
పర్యటించని డ్యామ్ సేఫ్టీ కమిటీ
వర్షాకాలానికి ముందు నివేదికలు ఇస్తేనే ఉపయోగం

నిర్మల్, వెలుగు : ఇరిగేషన్ ప్రాజెక్టుల కాలువలు, గేట్ల రిపేర్లు, పూడికతీత విషయంలో సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. ఎప్పటికప్పుడు రిపేర్లు చేయకపోతుండటంతో వాటి భద్రత ప్రశ్నార్థకమవుతోంది.రాష్ట్రంలోని ప్రాజెక్టుల ఆధునీకరణ చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫండ్స్​ రిలీజ్ చేయకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను ఉపయోగించుకునే చర్యలు తీసుకోకపోవడంతో ప్రాజెక్టుల భవిష్యత్ ​ప్రశ్నార్థకమవుతున్నది. 
ప్రధాన సమస్య పూడిక.. 
మన రాష్ట్రంలోని సాగునీటి  ప్రాజెక్టులకు పూడిక ప్రధాన సమస్యగా మారింది. ఏటా రిజర్వాయర్లలోకి వరద నీటి  ప్రవాహంతో భారీగా పూడిక వచ్చి చేరుతోంది. దీనివల్ల రిజర్వాయర్లలో నీటిమట్టం లెక్కలు తలకిందులవుతున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని గ్రహించి గతంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో టెలీమీటర్ల ద్వారా పూడిక లెక్కలు తీశారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 91 టీఎంసీలు కాగా, దాదాపు 25 టీఎంసీలకు పైగా పూడిక చేరుకున్నట్లు కేంద్ర జల సంఘం అధికారులు తేల్చారు. నిర్మల్ జిల్లాలోని కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. మహారాష్ట్ర వైపు నుంచి ప్రాజెక్టు రిజర్వాయర్​లోకి వచ్చే వరద నీటితో నల్ల మట్టి బురద వస్తోంది. పూడికను ప్రాజెక్టుల్లోకి రాకుండా చూడడానికి కాంగ్రెస్ ​హయాంలో బ్యాక్ వాటర్ పై ప్రాంతంలో సిల్ట్ అరెస్టు ట్యాంకులు నిర్మించారు. కానీ ఇవి పూడికను పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోయాయి. అయితే రిజర్వాయర్లలో నుంచి పూడిక తీయడానికి అయ్యే  ఖర్చుతో మరో మినీ ప్రాజెక్టు నిర్మించవచ్చని ఇరిగేషన్ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే పూడిక తీయడం లేదని చెబుతున్నారు. దీని కారణంగా ఏటేటా పూడిక శాతం పెరిగిపోతుండడంతో భవిష్యత్​లో ప్రాజెక్టులతో ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి తలెత్తనుంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే నీటిని కిందికి వదిలేటప్పుడు పూడిక కూడా ఆ ప్రవాహంతో వెళ్లే విధంగా గేట్లను రీ మోడిఫికేషన్​చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 
రిపేర్లు లేక మొరాయిస్తున్న గేట్లు  
సాగునీటి  ప్రాజెక్టుల గేట్ల రిపేర్లు, మెయింటనెన్స్​పైనా రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టడం లేదు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్లకు రిపేర్లు చేయకపోవడంతో గేట్లు ఎత్తేటప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు వర్షాకాలంలో వరద నీటిని కిందికి వదిలేప్పుడు గేట్లు మొరాయించాయి. ఒకటి రెండు సార్లు గేట్లు ఇలా జరిగినప్పుడు వరద నీటి ఉధృతిని పరిగణలోకి తీసుకుని లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాల్సి వచ్చింది. కడెం ప్రాజెక్టుతో పాటు ఎస్సారెస్పీ,  స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్లు కూడా ఇలాగే ఉన్నాయి. దీనివల్ల వర్షాకాలంలో 64 రోజులపాటు గేట్లను వరద నీటి కోసం ఆపరేట్ చేయాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు. ప్రతి యేటా సక్రమంగా నిధులు విడుదల  చేయకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.  
29 ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు కేంద్రం రెడీ 
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్ర జల సంఘం కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించింది. ఇందులో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి గురించి తెలుసుకున్న సెంట్రల్​గవర్నమెంట్​ మొత్తం 29 ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంక్ నిధులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కేంద్రం అమలు చేస్తున్న డ్యామ్ రిహాబిలిటేషన్  ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ (డ్రిప్) కింద రాష్ట్ర ప్రాజెక్టులను చేర్చింది. అలాగే దేశ వ్యాప్తంగా డ్రిప్ స్కీమ్ ​కింద 21 రాష్ర్టాల్లోని 736  డ్యామ్ లను రక్షణ పనుల కోసం ఎంపిక చేసి, రూ.10 వేల 211 కోట్లతో అంచనాలు రూపొందించింది.  ఇ౦దులో మన రాష్ట్రంలో 29 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటి కోసం రూ.645 కోట్లతో ప్రపోజల్స్​తయారు చేసింది. 
పని మొదలు పెట్టని డ్యాం సేఫ్టీ కమిటీ
కేంద్ర ప్రభుత్వ స్కీమ్​అయిన డ్రిప్ ​అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల కింద డ్యాం సేఫ్టీ  కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు రాష్ట్రంలోని 29 ప్రాజెక్టులను సందర్శించి ప్రాజెక్టుల ప్రస్థుత పరిస్థితిపై నివేదికలను రూపొందించాలి. వీటిని ఎంత తొందరగా అందజేస్తే అంతే స్పీడ్​గా నిధులు వచ్చి పనులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. రెండు నెలలు గడిస్తే వర్షాకాలం సీజన్ మొదలవుతుంది. అప్పుడు రిపేర్లకు, పనులకు అవకాశం ఉండదు. ఏం చేసినా ఈ టైంలోపే పూర్తి చేయాలి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డ్యాం సేఫ్టీ కమిటీలను ప్రాజెక్టుల విజిటింగ్​కు పంపిస్తే బాగుంటుందని  సాగునీటి రంగ నిపు ణులు చెబుతున్నారు.  దీనివల్ల  చివరి  ఆయకట్టు వరకు సాగునీరందుతుందంటున్నారు.