Diwali Special : దివ్వెల సంబరం.. దీపావళి పండుగ.. ప్రాధాన్యత... ప్రత్యేకతలు ఇవే..!

Diwali Special : దివ్వెల సంబరం.. దీపావళి పండుగ.. ప్రాధాన్యత... ప్రత్యేకతలు ఇవే..!

జీవితమే ఒక పండుగ అసలు ప్రతి రోజూ దీపావళి లాంటిదే. వెలుగు దివ్వెల సంబరమే దేవాళి. నిద్రలేచింది మొదలు పడుకునే వరకు మనసును మంచితనంతో నింపి ప్రతి ఒక్కరూ తారాజువ్వలా పైకి ఎదగాలి. మనలోని చీకటిని తరిమి కొట్టాలి. దీపం వెలుగులో నీలం, పసుపు, తెలుపు రంగులు కలిసి ఉంటాయి. అవి విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతం, సమాజంలో చెడు ఎంత చెలరేగినా చివరకు నాశనం కాక తప్పదని చెప్పే పండుగ ...దివ్వెల దీపావళి పండుగ విశేషాలను తెలుసుకుందాం. . .

లక్ష్మీపూజ: దీపావళి సందర్భంగా లక్ష్మీపూజ చేస్తారు. దీని వెనుక ఓ పురాణ కథ ఉంది. దుర్వాస మహర్షికి దేవేంద్రుడు ఆతిథ్యం ఇస్తాడు. దానికి సంతోషించిన దుర్వాసుడు ఇంద్రుడికి ఒక హారాన్ని బహుమతిగా ఇస్తాడు. కానీ ఇంద్రుడు దాన్ని తన దగ్గరున్న ఐరావతం మెడలో చేస్తాడు. అందుకు కోపించిన దుర్వాసుడు ఇంద్రపదవి తోపాటు, సకల సంపదలు పోవాలని శపిస్తాడు. దాంతో ఇంద్రుడు విష్ణువును ప్రార్థిస్తే, జ్యోతిని వెలిగించి, ఆ జ్యోతినే మహాలక్ష్మిగా భావించి పూ జించమని సలహా ఇస్తాడు. ఇంద్రుడు అలా చేయడంతో లక్ష్మీదేవి ఇంద్రుడికి మళ్లీ సకల భోగాలను తిరిగి వచ్చేలా చేస్తుంది. విజయాన్ని, ఐశ్వర్యాన్ని కో రేవాళ్లు మహాలక్ష్మిని ఆ రోజు ( అక్టోబర్​20)  పూజిస్తే  లభిస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవిని దీపంగా భావించి ప్రార్థిస్తారు. అంతేకాదు మహిళలు   కార్తీకమాసం అంతా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు.

చిన్ననాటి ముచ్చట్లు: దీపావళి అంటే నేటి పెద్దతరం వారు చిన్ననాటి రోజుల్లోకి వెళ్తారు. పిల్లలుగా దీపావళి రోజు వాళ్లు చేసిన అల్లరి. కాల్చిన పటాకులు, జరిన సంఘటనలు అన్నీ గుర్తు చేసుకుంటారు. గంధకం, సూరేకారం, తగరంతో తయారు చేసిన మతాబులు కాల్చిన విష్ణుచక్రాలు, భూచక్రాలు,  బిచ్చుబుడ్లు, నేల టపాకాయలు గురించి ఆనందంగా చెప్తారు. తాటాకుటపాకాయలు ధైర్యంగా పేల్చి వీధిలో అందరిముందు కాలరిగచేసిన సంగతులు .. తారాజువ్వలు పైకి పంపి ఎంత దూరం వెళ్లిందా అని  లెక్కలేసిన ఊసులు.. అన్నీ కథలు కథలుగా వివరిస్తారు. ఊళ్లలో జట్లుగా ఏర్పడి పోటీలు పడి నరకాసురుడి బొమ్మను తయారుచేసి, కాల్చిన రోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లతో పటాకుల పంపకాల్లో వచ్చిన గొడవల గురించి గుర్తు చేస్తారు. రాత్రి పదకొండు దాటినా మాపటాసులు ఇంకా మిగిలే ఉన్నాయని తెల్లారి స్కూల్లో స్నేహితులు ముందు గొప్పలు పోయిన సంగతులు.. ఎన్నో ఎన్నెన్నో అని 50 ఏళ్లు దాటిన వాళ్లంతా చెప్తారు.

అయిదు రోజుల సంబరం: దీపావళి ప్రతి ఏడు ఆశ్వయుజ మాసంలో బహుళ అమావాస్యరోజు వస్తుంది. ఈ పండుగను అయిదు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ధనత్రయోదశి. దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి పుట్టింది. ఆమెను సంపదకు దేవతగా భావిస్తారు. అందుకు గుర్తుగా దీపావళికి రెండు రోజుల ముందు రోజున ధనత్రయోదశిని చేసుకుంటారు. రోజు కొద్దిగా అయినా బంగారం కొంటే కలిసొస్తుందని నమ్ముతారు. రెండోరోజు సరక చతుర్దశి..  ద్వాపరయుగంలో నరకాసురుడనే రాక్షసుడు తల్లి చేతిలో తప్ప ఇతరుల వల్ల మరణం లేకుండా వరాన్ని పొంది ప్రజలను బాధిస్తుండే వాడు అహంకారంతో స్త్రీలందరినీ అవమానిస్తుండేవాడు. చివరకు నరకాసురుడి తల్లైన భూదేవి సత్యభామగా పుట్టి, కృష్ణుడితో కలిసి అతడ్ని చంపుతుంది. మూడురోజు దీపావళి నరకాసురుడు చనిపోయిన సందర్భంగా ప్రజలందరూ దీపాలు వెలిగించి, టపాకాయురాలను కాల్చి  పండుగ చేసుకుంటారు. ఇక నాలుగోరోజు బలి పాడ్యమి అంటే ప్రహ్లాదుని మనుమడైన బలిచక్రవర్తి ఇంద్రపదవి దక్కించుకోవాలని అనుకుంటాడు. విష్ణువు వామనరూపంలో అతడిని మూడడుగుల నేల అడిగి పాతాళ లోకానికి నెట్టేస్తాడు. అతని దాన గుణాన్ని మెచ్చి ప్రతి ఏడాది కార్తీక శుక్ల పాడ్యమి రోజు భూలోకానికి రావచ్చనే వరం ఇస్తాడు. ఈ రోజును భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు కానుకలిచ్చుకుని ప్రేమను తెలియజేసుకుంటారు. చివరిగా అయిదవ రోజు అన్నా చెల్లెళ్ల పండుగ దీనినే భగినీ హస్త భోజనం అనీ పిలుస్తారు. అన్నలు, చెల్లెళ్ల ఇంటికి వెళ్లి కానుకలు ఇచ్చి వాళ్ల చేతివంట తినివస్తారు..

పారద్రోలేందుకే : పటాకులు పేల్చడం అని అనుకుంటాం కానీ దీని వెనుకకు ఆరోగ్య రహస్యం ఉంది. ప్రకృతి సూత్రం దాగి ఉంది. దీపావళి శీతాకాలం ప్రారంభంలో వస్తుంది.  ఇప్పటికే వర్షాకాలంలో పెరిగిన దోమలు, క్రిముల వల్ల రకరకాల రోగాలు వస్తాయి. పటాకులు పేల్చడం వల్ల వచ్చే పొగవల్ల అవి నాశనం అవుతాయి. పెద్దపెద్ద శబ్దాలు వచ్చే టపాకాయలు ఎక్కువ కాల్చకుండా క్రిమి కీటకాలను నాశనం చేసే భూచక్రాలు, వెలుగులు వెదజల్లే చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు కాల్చడం మంచిది. అలాగే కాల్చేటప్పుడు పిల్లలు, పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్ దుస్తులు వేసుకోవాలి. కంటికి దూరంగా ఉంచి పేల్చాలి. ప్రత్యేకమైన కళ జోళ్లు వాడటం మంచిది..

దీపావళి రోజే : రావణాసురుడ్ని వధించిన తర్వాత శ్రీరాముడు... సీత, లక్ష్మణులతో కలిసి అయోధ్యకు వచ్చింది దీపావళి రోజేనని చెప్తారు. జూదంలో ఓడి అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తి చేసిన పాండవులు తిరిగి హస్తినాపురానికి తిరిగి వచ్చింది ఈ రోజేనట. షట్చక్రవర్తుల్లో ఒకడైన విక్రమాదిత్యుడు పట్టాభిషేకం జరిగింది దీపావళి నాడే .. ఇంకా తొలి తెలుగు రాజైన శాలివాహను డు... విక్రమార్కుడిని ఓడించి ఆంధ్రసామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసింది ఈ రోజేనని అంటారు