
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ పురుషాధిపత్యమే నడుస్తోంది. అగ్ర నటీనటుల పారితోషికాల విషయంలోనైనా, వారి కోసం రాసే పాత్రల విషయంలోనూ పురుషులే టాప్ లో ఉంటారు. బాలీవుడ్ తారలు శ్రీదేవి, హేమామాలిని వంటి అతి కొద్ది మంది కథానాయికలు మాత్రమే తమ సమకాలిన హీరోల కంటే ఎక్కువ సంపాదించిన వారిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అగ్ర హీరోల పారితోషికాలు, వారికి దక్కే పాత్రల విషయంలో ఇంకా వ్యత్యాసం ఉంది. అయితే ఆన్ లైన్ పాపులారిటీ విషయంలో మాత్రం కొంతమంది అగ్ర తారలు అత్యంత పెద్ద సూపర్ స్టార్లను కూడా అధిగమిస్తూ దూసుకెళ్తున్నారు.
ఖాన్‌లను దాటిన దీపికా ..
ఇంటర్నెట్‌లో పాపులారిటీ విషయానికి వస్తే, దీపికా పదుకొణె ఇప్పుడు అందరికంటే ముందున్నారు. ఇటీవల IMDb విడుదల చేసిన '25 ఏళ్ల భారతీయ సినిమా' నివేదిక (2000-2025)లో గత దశాబ్ద కాలంలో (జనవరి 2014 నుండి ఏప్రిల్ 2024 వరకు) ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ నటుల జాబితాలో దీపికా పదుకొణె అగ్రస్థానంలో నిలిచింది.
ప్రతి నెలా IMDb ని సందర్శించే 250 మిలియన్ల వినియోగదారుల పేజీ వీక్షణల ఆధారంగా రూపొందించిన ఈ 'మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ ది లాస్ట్ డికేడ్' జాబితాలో దీపికా, తన సహనటుడు షారుఖ్ ఖాన్‌ను సైతం అధిగమించడం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ జాబితాలో ముగ్గురు అగ్ర ఖాన్లు (షారుఖ్, అమీర్, సల్మాన్ ), అలాగే రాజనీకాంత్ వంటి అగ్ర నటులు ఉన్నప్పటికీ, వారి కంటే ఒక మహిళా స్టార్ ముందు నిలబడటం విశేషం. టాప్ 5లో ఐశ్వర్య రాయ్, ఆలియా భట్ వంటి మరో ఇద్దరు మహిళా తారలు ఉన్నారు. టాప్ 10లో బాలీవుడ్ అగ్ర తారలు అమీర్ ఖాన్ (6), సల్మాన్ ఖాన్ (8), హృతిక్ రోషన్ (9), అక్షయ్ కుమార్ (10) ఉన్నారు.. ప్రాంతీయ స్టార్లలో ప్రభాస్ (29) , ధనుష్ (30) మాత్రమే ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.
దీపికా ఆసక్తికర స్పందన
ఈ ఘనత సాధించడంపై దీపికా పదుకొణె ఎంతో ఉద్వేగంగా స్పందించింది. విజయం సాధించాలంటే ఒక మహిళ తన కెరీర్‌ను ఎలా నడిపించాలో నాకు చాలా మంది చెప్పేవారు. కానీ, నేను మొదటి నుంచీ ప్రశ్నించడానికి, కష్టమైన మార్గాన్ని ఎంచుకోవడానికి భయపడలేదు. నిజాయితీ, ప్రామాణికత , పట్టుదల ముఖ్యమని ఈ IMDb నివేదిక నా నమ్మకాన్ని మరింత బలపరిచింది. మనం నిజంగా నమ్మిన వాటికి కట్టుబడి ఉంటే మార్పు సాధ్యమే అని ఆమె స్పష్టం చేసింది. తన అభిమానులు, కుటుంబం, సహచరులు తనపై ఉంచిన నమ్మకం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపింది.
ప్రాజెక్టుల నుండి వైదొలగడానికి అసలు కారణం!
దీపికా ఇటీవల ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న 'స్పిరిట్', 'కల్కి 2898 AD' సీక్వెల్ వంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్టుల నుండి వైదొలగడం చర్చనీయాంశమైంది. 'అనవసరమైన డిమాండ్లు', తక్కువ పని గంటలను కోరడం వల్లే ఆమె వైదొలిగిందని ఆరోపణలు వచ్చాయి. అయితే గతేడాది సెప్టెంబర్‌లో 'దువా' అనే బిడ్డకు జన్మనిచ్చిన కొత్త తల్లి కావడంతో, తన బిడ్డ సంరక్షణ కోసం కేవలం 8 గంటల షిఫ్ట్‌లనే దిపికా కోరుతున్నారు అని ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ప్రొఫెషనల్ కమిట్‌మెంట్ కంటే మాతృత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఆమె ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడిస్తున్నారు..
ప్రస్తుతం దీపికా, అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న 'AA22xA6' , షారుఖ్ ఖాన్‌తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ తీస్తున్న 'కింగ్' చిత్రాలలో నటించనున్నారు. ఈ రెండు సినిమాలు 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.