
- టోలిచౌకిలో ఇద్దరు అరెస్ట్..
- 10 కిలోల మాంసం, 3 జింక కొమ్ములు స్వాధీనం
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ లో జింక మాంసం పట్టుబడడం కలకలం సృష్టించింది. టోలిచౌకిలో10 కిలోల జింక మాంసాన్ని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఆదివారం వెల్లడించారు. టోలిచౌకి సబ్జా కాలనీకి చెందిన డాక్టర్ మహ్మద్ సలీమ్ మూస (47), బజార్ ఘాట్ నాంపల్లికి చెందిన మహ్మద్ ఇక్బాల్ కలిసి జహీరాబాద్ ఫారెస్ట్ ఏరియా నుంచి జింక మాంసం తీసుకొచ్చారు.
డాక్టర్ సలీమ్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి ఈ మాంసాన్ని శనివారం రాత్రి తన ఫ్రెండ్ ఇంట్లో పార్టీ చేసుకోవడానికి తీసుకెళ్తుండగా.. పోలీసులకు సమాచారం అందింది. టోలిచౌకి ఇన్స్పెక్టర్ రమేశ్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10 కిలోల జింక మాంసం, మూడు జింక కొమ్ములతో పాటు లైసెన్స్ ఉన్న ఐదు రైఫిల్స్, బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. వన్యప్రాణి రక్షణ చట్టం, 1972 చట్టం కింద నిందితులపై కేసు నమోదుచేసి ఫారెస్టు అధికారులకు అప్పగించారు.