చిక్కుల్లో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. తన పరువుతీశారంటూ కేసు వేసిన పోలీస్

చిక్కుల్లో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. తన పరువుతీశారంటూ కేసు వేసిన పోలీస్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి వివాదంతో చిక్కుకున్నారు. ఈ సారి ఆర్యన్ ఖాన్ సృష్టి, దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్' (The Ba***ds of Bollywood)  ఈ కొత్త వివాదానికి తెర తీసింది. అది కూడా నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లోని ఒక పాత్ర.  2021లో ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారి సమీర్ వాంఖెడేను పోలి ఉందని నెటిజన్లు తీవ్రంగా చర్చించుకోవడంతో వెలుగులోకి వచ్చింది.

వాంఖెడే ప్రధాన ఆరోపణలు


ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా  సమీర్ వాంఖెడే రంగంలోకి దిగారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ సిరీస్‌ను రూపొందించారని ఆరోపిస్తూ, ఆర్యన్ ఖాన్‌తో పాటు ఆయన తండ్రి, ప్రముఖ నటుడు షారుఖ్ ఖా న్ పైనా ముంబై కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇది 'తప్పుడు, దురుద్దేశపూరితమైన, పరువు నష్టం కలిగించేది'గా అభివర్ణించారు. ఈ సిరీస్ 'మాదకద్రవ్యాల నిరోధక చట్టాల అమలు సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా, ప్రజల్లో వాటిపై ఉన్న విశ్వాసాన్ని తగ్గించే విధంగా ఉంది' అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, దురుద్దేశపూర్వకంగానే ఈ సిరీస్‌ను 'ఉద్దేశపూర్వకంగా సంభావితం చేసి, రూపొందించారు' అని వాంఖెడే బలంగా వాదించారు.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ..

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయినప్పుడు, దర్యాప్తు అధికారిగా వాంఖెడే పేరు దేశవ్యాప్తంగా ప్రముఖంగా వినిపించింది. అయితే, ఆ తరువాత ఆర్యన్‌కు ఈ కేసులో క్లీన్ చిట్ లభించింది. అదే సమయంలో, షారుఖ్ ఖాన్ నుండి రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలతో వాంఖెడేపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఈ వెబ్ సిరీస్‌లో తనను పోలిన పాత్రను సృష్టించడం అనేది ఆర్యన్ ఖాన్ కుటుంబం పాత కక్షలను తీర్చుకోవడమేనని వాంఖెడే భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్యన్ ఖాన్ తొలిసారిగా దర్శకుడిగా పరిచయమైన ఈ సిరీస్, బాలీవుడ్‌లోని వారసత్వం (Nepotism), లీకైన వీడియోలు, కుట్రలు వంటి అంశాలపై వ్యంగ్యంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్ర నటులు కూడా అతిథి పాత్రల్లో  కనిపించారు. .

నిజ జీవితంలోని సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా కథలను సృష్టించడం అనేది కళాత్మక స్వేచ్ఛలో భాగమే అయినప్పటికీ, అది చట్టపరమైన పరిమితులకు లోబడే ఉండాలి. సమీర్ వాంఖెడే దాఖలు చేసిన ఈ పరువు నష్టం దావాపై న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.