
రాష్ట్రంలో నియంతృత్వ పాలన: వివేక్ వెంకటస్వామి
కమీషన్ల డబ్బులు పంచి గెలుస్తామనుకుంటున్నరు
అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదని ఆగ్రహం
జాన్‌పహాడ్ దర్గాను సందర్శించిన మాజీ ఎంపీ
పాలకవీడు/ నేరేడుచర్ల, వెలుగు: హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ను ఓడించి.. ఆ పార్టీ నేతల అహంకారాన్ని దించాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ దర్గాను వివేక్ దర్శించుకున్నారు. తర్వాత నేరేడుచర్ల పట్టణంలో బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కారు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని, ప్రాజెక్టులపై తీసుకున్న కమీషన్లతో ఎమ్మెల్యేలను కొంటోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నాడన్నారు. 100 కోట్లతో ప్రగతిభవన్ కట్టుకుని.. పేదలకు మాత్రం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టివ్వడం మర్చిపోయారని విమర్శించారు. బీజేపీని గెలిపించి, టీఆర్ఎస్ నేతలకు పట్టిన అహంకారాన్ని దించాలన్నారు. బీజేపీని గెలిపిస్తే భవిష్యత్తులో నియోజకవర్గానికి అనేక నిధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఖబడ్దార్ కేసీఆర్ అని హెచ్చరించారు.
ఓటు బీజేపీకే వేయాలి
రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, ఆ తుగ్లక్ పాలన వల్లే టీఆర్ఎస్కు లోక్‌సభ ఎలక్షన్లలో ఎదురుదెబ్బ తగిలిందని వివేక్ గుర్తు చేశారు. ఇప్పుడు హుజూర్నగర్ లో టీఆర్ఎస్ ని గెలిపిస్తే బిల్డింగులను కూల్చడం తప్ప ఎటువంటి అభివృద్ధి జరగదని కామెంట్ చేశారు. కేసీఆర్ ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు. డబ్బులు పంచి గెలుస్తామని టీఆర్ఎస్ భావిస్తోందని, ఆ పైసలు తీసుకోవాలని, ఓటు మాత్రం బీజేపీకి వేయాలని వివేక్ పిలుపునిచ్చారు. అప్పుడే టీఆర్ఎస్ అహంకారం దిగుతుందని చెప్పారు.
చాలెంజ్‌గా తీసుకుందాం..
టీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, పాలన మొత్తం అస్తవ్యస్తంగా మారిందని హుజూర్నగర్ బీజేపీ క్యాండిడేట్ కోట రామారావు అన్నారు. రైతుబంధు సాయం సరిగా అందడం లేదని, విష జ్వరాలలో పెద్ద సంఖ్యలో జనం బాధపడుతున్నారని చెప్పారు. యాద్రాద్రిలో కేసీఆర్, కారు బొమ్మలు చెక్కిన రోజు నుంచే టీఆర్ఎస్ పతనం మొదలైందన్నారు. టీఆర్ఎస్ క్యాండిడేట్ సైదిరెడ్డి ఆంధ్రాకు చెందినవారని, భూదందాలు చేసే ఆయనను గెలిపిస్తే అభివృద్ధి జరగదని పేర్కొన్నారు. ఉప ఎన్నికతో మన సామర్థ్యం ఏంటో చూపొచ్చని, దీనిని చాలెంజ్‌గా తీసుకోవాలని మిర్యాలగూడ బీజేపీ ఇన్చార్జి కర్నాటి ప్రభాకర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉత్తమ్ ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా చేసిందేమీ లేదన్నారు. కార్యకర్తలే మనకు బలమని, టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చాటాలని జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ బీసీ వర్గానికి చెందినవారికి టికెట్ ఇచ్చిందని, బీసీలంతా కలిసి కోట రామారావును గెలిపించాలని బొబ్బ భాగ్యరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ క్యాండిడేట్ సైదిరెడ్డి కొంతకాలంగా హుజూర్నగర్ లో ఉంటూ భూకబ్జాలకు పాల్పడుతున్నారని, ఓ వర్గాన్ని తయారు చేసుకొని జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని మెదక్ మాజీ ఎమ్మెల్యే చంద్రారెడ్డి విమర్శించారు.
ఇంటింటికీ వెళ్దాం..
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ చేర్చే బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని వివేక్ చెప్పారు. ‘‘నేను మీ మధ్యలోనే ఉంటా. ప్రతి ఇంటికి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ వివరిద్దాం. బీజేపీ క్యాండిడేట్ కోట రామారావును ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. పది మంది కరుడుగట్టిన కార్యకర్తలు వెయ్యి మందితో సమానం. అందరం గట్టిగా పనిచేద్దాం..” అని పిలుపునిచ్చారు.