కాగజ్ నగర్ లో గెలిచిన అభ్యర్థి ఇంటికి కత్తితో వెళ్లిన ఓడిన అభ్యర్థి భర్త

కాగజ్ నగర్ లో గెలిచిన అభ్యర్థి ఇంటికి కత్తితో వెళ్లిన ఓడిన అభ్యర్థి భర్త
  • తమ ఓటమికి కారణం మీరేనని వాగ్వాదం 
  • ఎన్నికల్లో ఖర్చయిన రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్
  • నిరాకరించడంతో దాడికి యత్నం

కాగజ్ నగర్, వెలుగు: సర్పంచ్  ఎన్నికలో  ఓటమిని జీర్ణించుకోలేని అభ్యర్థి భర్త.. తమపై నెగ్గిన  అభ్యర్థి ఇంటికి కత్తితో వెళ్లి గొడవ పడ్డాడు. తాము ఓడేందుకు మీరే కారణమని కొట్లాటకు దిగాడు. ఎన్నికల్లో రూ.2 లక్షలు ఖర్చు చేశామని, ఆ డబ్బులు ఇవ్వాలని డిమాండ్  చేశాడు. 

సోమవారం ఉదయం కుమ్రం భీం ఆసిఫాబాద్  జిల్లా సిర్పూర్  టీ మండలం ఇటికెల పహాడ్  గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో  వడాయి తానుబాయి.. తన ప్రత్యర్థి మోర్లే మీరాబాయి పై సర్పంచ్​గా గెలిచారు.  ఈ ఓటమిని జీర్ణించుకోలేని మీరాబాయి భర్త  భీంరావు సోమవారం తెల్లవారుజామున తానుబాయి ఇంటికి వెళ్లి ఆమె భర్త పోశెట్టితో డబ్బుల కోసం గొడవపడ్డాడు.  

కత్తితో దాడికి వస్తున్న భీంరావును చుట్టుపక్కల వారు గమనించి పట్టుకున్నారు. అతడిని తాడుతో గుంజకు కట్టేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనస్థానికంగా కలకలం రేపింది. ఈ విషయమై సర్పంచ్  భర్త పోశెట్టి  ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ సురేశ్  తెలిపారు.  గ్రామాల్లో అభ్యర్థులు సంయమనం పాటించాలని కోరారు.