
జమ్మికుంట / వీణవంక, వెలుగు : దళితబంధులో భాగంగా ప్రభుత్వం అందజేస్తున్న యూనిట్లలో లబ్ధిదారులకు నాసిరకం వాహనాలు చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లిలో ఇద్దరు లబ్ధిదారులకు కలిపి ఒక యూనిట్ కింద హార్వెస్టర్ ఇవ్వగా పాత బాడీ కి కొత్త ఇంజిన్ బిగించి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కోరుకంటి రేణుక, కోరుకంటి అంజయ్య కుటుంబాలకు కలిపి ఒక యూనిట్‌గా సర్కారు హార్వెస్టర్మంజూరు చేసింది. రెండు రోజుల క్రితం మహీంద్రా కంపెనీకి చెందిన హార్వెస్టర్‌ను అధికారులు, లీడర్లు లబ్ధిదారులకు అందజేశారు. అయితే ఇంటికి వెళ్లాక హార్వెస్టర్‌ను పరిశీలించి చూడగా ఇంజిన్ మాత్రమే కొత్తగా ఉందని, పాత బాడీకి అక్కడక్కడా రంగు పూసి ఇచ్చినట్టు కనిపిస్తోందని లబ్ధిదారులు ఆరోపించారు. మధ్యలో వెల్డింగ్ కూడా చేశారని చెప్పారు. హార్వెస్టర్‌కు రూ.20 లక్షలు ఉంటుందని, అతుకుల బొంతను అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.