
యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి ఓపెన్ చేసి దర్శనాలు మొదలై వారం కూడా గడవకముందే నిర్మాణాల్లో లోపాలు బయటపడుతున్నాయి. ప్రధానాలయంలో మురుగునీరు బయటకు పోవడానికి, వాననీళ్లు గుడిలో చేరకుండా ప్రత్యేకంగా అండర్ డ్రైన్ ఏర్పాటు చేశారు. వాటికి ట్రయల్స్ నిర్వహించకపోవడంతో డ్రైన్ పనుల్లో లోపాలు ఇప్పుడు వెలుగుచూశాయి. ప్రారంభానికి ముందు ఫైరింజన్ల సాయంతో గుడిని కడిగి శుద్ధి చేశారు. ఈ నీళ్లు మొత్తం డ్రైనేజీ ద్వారా బయటకు వెళ్లడానికి లింక్ ఇచ్చారు. లింక్ ద్వారా నీళ్లు బయటకు పోకపోవడంతో చెడు వాసన వస్తున్నది. దీంతో శానిటేషన్ సిబ్బంది మంగళవారం ఆలయానికి తూర్పు వైపున డ్రైన్ లైన్‌ను ఓపెన్ చేసి రిపేర్లు చేపట్టారు. వైటీడీఏ ఆఫీసర్లు ఎలాంటి ముందుచూపు లేకుండా.. అసలు డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) లేకుండానే కొండపైన ఆలయ పునర్నిర్మాణం జరపడంతోనే ఇలాంటి లోపాలు బయటపడుతున్నాయని తెలుస్తోంది. గుడి రీ ఓపెన్ చేయడానికి ముందుగానే అన్ని విభాగాల్లో ట్రయల్ రన్ నిర్వహించి ఉంటే అప్పుడే లోపాలు బయటపడేవని.. ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదన్నారు.