రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు కరోనా పాజిటివ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల దేశంలో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఎక్కువగా కొవిడ్ బారినపడుతున్నారు. ఇటీవలే ఢిల్లీ, రాజస్థాన్ సీఎంలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, మహారాష్ట్రలో 11 మంది మంత్రులు, నలుగురు సుప్రీం జడ్జిలు, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా ఇవాళ దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, హోం క్వారంటైన్‌లో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. గడిచిన కొద్ది రోజులుగా తనను కలిసిన వాళ్లు ఐసోలేషన్‌లో ఉండాలని, అవసరమైతే కొవిడ్ టెస్టు చేయించుకోవాలని రాజ్‌నాథ్ కోరారు.

మరోవైపు, దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ ఒక్క రోజులో లక్షా 79 వేల 723 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో మహారాష్ట్ర నుంచే 44 వేల 388, యూపీలో 7 వేల 695, ఢిల్లీలో 27 వేల 75 కేసులు ఉన్నాయి. నిన్నటి కంటే 12.5 శాతం కేసులు పెరిగాయి. డైలీ పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. ఆదివారం 146 మంది కరోనాతో చనిపోగా.. 46 వేల 569 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7లక్షల 23వేల 619 యాక్టివ్ కేసులు ఉన్నాయి.