ప్రతీకారం తీర్చుకుంటం

ప్రతీకారం తీర్చుకుంటం
  • కథువా టెర్రర్ అటాక్​పై రక్షణ శాఖ రియాక్షన్​
  • మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి సంతాపం
  • టెర్రరిస్టులది పిరికిచర్య అని కామెంట్

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని కథువా జిల్లా బాడ్ నోటా గ్రామంలో ఆర్మీ వాహనాలపై పాకిస్తాన్  టెర్రరిస్టులు జరిపిన దొంగదెబ్బకు కచ్చితంగా బదులు తీర్చుకుంటామని, ముష్కరులు ఎక్కడున్నా వెంటాడి బదులు చెప్తామని రక్షణ శాఖ కార్యదర్శి భరత్  భూషణ్  బసు తెలిపారు. ఈ మేరకు ఎక్స్​లో ఆయన పోస్టు చేశారు. ‘‘టెర్రరిస్టుల దాడిలో వీరమరణం పొందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.

జవాన్ల ప్రాణత్యాగాన్ని దేశం ఎప్పటికీ మరవదు. దొంగదెబ్బ తీసి జవాన్లను హత్యచేసిన ముష్కరులపై ప్రతీకారం తీర్చుకుంటాం. దాడి వెనుక ఉన్న దుష్టశక్తులను ఓడిస్తాం” అని భరత్  భూషణ్​ పేర్కొన్నారు. టెర్రర్  అటాక్ పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. టెర్రరిస్టులది పిరికి చర్య అని మండిపడ్డారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.

అలాగే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్  గాంధీ కూడా టెర్రర్  దాడిని ఖండించారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘ఒక్క నెలలోనే ఇది ఐదో అటాక్. దేశ భద్రతకు, జవాన్ల జీవితాలకు ఇది గట్టిదెబ్బ. వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులకు దీటుగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఉత్త మాటలు, అబద్ధపు హామీలు సరిపోవు” అని రాహుల్  వ్యాఖ్యానించారు. కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున్  ఖర్గే, నేషనల్  కాన్ఫరెన్స్  లీడర్  ఒమర్  అబ్దుల్లా, పీడీపీ చీఫ్​ మెహబూబా ముఫ్తీ, గులాంనబీ ఆజాద్  తదితరులు దాడిని ఖండించారు.

రెక్కీ నిర్వహించి దొంగదెబ్బ

దాడికి ముందు టెర్రరిస్టులు.. బాడ్ నోటా గ్రామం లో రెక్కీ నిర్వహించారు. 23 మంది టెర్రరిస్టులు, 12 మంది లోకల్  గైడ్లు రోడ్డు పక్కన ఎత్తైన ప్రాంతంలో ఉండి.. ఆర్మీ కాన్వాయ్​పై గ్రనేడ్  దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత కాల్పులు జరిపారు.