అమర జవాన్ తల్లి కాళ్లు మొక్కిన రక్షణ మంత్రి

అమర జవాన్ తల్లి కాళ్లు మొక్కిన రక్షణ మంత్రి

డ్రెహ్రాడూన్: ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో పహారా కాస్తున్న జవాన్లకు దేశమంతా రుణపడి ఉందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం డెహ్రాడూన్ లో ఉత్తరాఖండ్ కు చెందిన అమర జవాన్ల మాతృమూర్తులను ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా వారి కాళ్లు మొక్కి.. వీర జవాన్ల త్యాగాలకు కృతజ్ఞత తీర్చుకున్నారు.

డెహ్రాడూన్ లోని సర్వే ఆడిటోరియంలో ఉత్తరాఖండ్ కు చెందిన పలువురు జవాన్ల తల్లులను పిలిచి ‘శౌర్య సమ్మేళన్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీం తెచ్చారని చెప్పారు. దీనికి ఇప్పటి వరకు రూ.35 వేల కోట్లు కేటాయించామన్నారు. అలాగే దాదాపు 60 ఏళ్లుగా దేశంలో వార్ మెమోరియల్ లేదని, ఫిబ్రవరిలో తమ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. అమరులైన జవాన్ల స్మృతులను సజీవంగా ఉంచే ప్రయత్నమిది అని ఆమె అన్నారు.