
- గతేడాదితో పోలిస్తే పెరిగిన డిగ్రీ అడ్మిషన్లు
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ బుధవారం పూర్తయింది. ఈ ఫేజ్ ద్వారా మొత్తం 57,338 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. 54,048 మందికి డిగ్రీలో సీట్లు కేటాయించారు. ఈ వివరాలను దోస్త్ చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి, కాలేజేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. 54,048లో ఫస్ట్ ప్రయారిటీ ఆప్షన్ ద్వారా 44,889 మందికి సీట్లు లభించాయి.
సెకండ్ ఆప్షన్ ద్వారా 9,159 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందినవారిలో కామర్స్ 22,328 మంది, ఫిజికల్ సైన్సెస్ 12,211 మంది, లైఫ్ సైన్సెస్ 10,435 మంది, ఆర్ట్స్ 8,979 మంది, ఇతర కోర్సులు 95 మంది ఉన్నారు. సీట్లు అలాటైన విద్యార్థులు ఆగస్టు 8 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని దోస్త్ అధికారులు సూచించారు. కాగా..2024~-25 విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. గతేడాది మొత్తం 1,96,820 మంది డిగ్రీ కోర్సుల్లో చేరగా, ఈ ఏడాది తాజా స్పెషల్ ఫేజ్‌తో కలిపి మొత్తం 1,97,739 మంది డిగ్రీ అడ్మిషన్లు పొందారు. ఇది గత ఏడాది కంటే 919 అడ్మిషన్లు ఎక్కువ.