భారత ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్ వ్యవహారాల్లో కొత్త మలుపు చోటుచేసుకుంది. తాజాగా అమెరికాలోని డెలావేర్ దివాళా న్యాయస్థానం బైజూస్ స్థాపకుడు బైజూ రవీంద్రన్‌పై రూ.9వేల కోట్లు(అంటే1 బిలియన్ డాలర్ల) జరిమానా విధించటం సృష్టించింది. 2021లో బైజూస్ అమెరికా బ్యాంకులు, రుణదాతలను మోసగించి రూ.11వేల కోట్లు అప్పుగా తీసుకుంది. బిజినెస్ నెమ్మదించటంతో తర్వాతి కాలంలో అప్పుల చెల్లింపుల్లో ఫెయిల్ అయ్యింది.
2024లో బైజూస్ అమెరికాలోని తన అనుబంధ సంస్థ బైజూస్ ఆల్ఫా, గ్లాస్ ట్రస్ట్ ఎల్ఎల్సీ.. రవీంద్రన్, ఆయన భార్య దివ్య గోకుల్‌నాథ్, సోదరుడు రిజు రవీంద్రన్ మీద రూ.4వేల500 కోట్ల నష్టం కలిగించినందుకు మోసం, దొంగతనం ఆరోపణలతో కేసు దాఖలు చేసింది. దీనిపై తాజాగా నవంబర్ 2025లో కోర్టు తీర్పు ఇచ్చి భారీ జరిమానా విధించింది రవీంద్రన్ పై.
2011లో స్టార్ట్ అయిన బైజూస్ సులభంగా అర్థమయ్యే, ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ లెర్నింగ్ అనుభవంతో శిక్షణగా మొదలైంది. అయితే ఆ తర్వాత వచ్చిన కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ విద్యకు భారీ డిమాండ్ వచ్చినప్పుడు, షారుక్ ఖాన్ వంటి ప్రముఖులతో భారీ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్ కూడా రన్ చేసింది. ఆ జోరులోనే వైట్ హ్యాట్ జూనియర్, ఆకాష్ వంటి సంస్థలను కూడా కొనుగోలు చేసింది. దీంతో అప్పట్లో స్టార్టప్ మార్కెట్ విలువ 22 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరుకుంది.
కానీ 2022 తర్వాత ఆర్థిక సంక్షోభం, ఫండింగ్ సమస్యలతో కుప్పకూలింది కంపెనీ. భారీ అప్పులు, కస్టమర్ల నుంచి ఫండ్ తిరిగి ఇవ్వకపోవడం, ఆడిట్ లోపాలు సంస్థ నమ్మకానికి తీవ్రమైన కష్టాలను తెప్పించాయి. 2023లో భారత ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్య చట్టం(FEMA) ఉల్లంఘనల ఆరోపణలపై దర్యాప్తు ప్రవేశపెట్టింది. ఆ సమయంలో పతనంలోకి వెళ్లిన కంపెనీ భారీగా ఉద్యోగులను కూడా తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బైజూస్ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా సున్నాకు పడిపోయింది. అయితే ఈ స్టోరీ ప్రస్తుతం దూకుడుగా ఫండింగ్ పొందుతూ ముందుకెళుతున్న యువ స్టార్టప్ వ్యవస్థాపకులకు పెద్ద కేస్ స్టడీగా మారింది.
