కేసీఆర్ కారణంగానే ఆలస్యం.. కృష్ణానదీ జలాల వివాదంపై కిషన్‌రెడ్డి

కేసీఆర్ కారణంగానే ఆలస్యం.. కృష్ణానదీ జలాల వివాదంపై కిషన్‌రెడ్డి
  • ట్రైబల్ యూనివర్సిటీ విషయంలోనూ నిర్లక్ష్యం చేశారు
  • రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ప్రజా ప్రయోజనాలకు నష్టం
  • గిరిజనులను గౌరవించేలా వర్సిటీకి సమ్మక్క సారక్క పేరు
  • రైతులకు మరింత మేలు చేసేలా పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ కారణంగానే కృష్ణానదీ జలాల వివాదం పరిష్కారం విషయంలో ఆలస్యమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గిరిజన వర్సిటీ విషయంలోనూ తీవ్ర జాప్యం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని, బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో తెలంగాణకు మేలు చేసేలా మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర కేబినెట్ మీటింగ్ తర్వాత ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కారు తీరుతో చాలా రోజులుగా ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో కేంద్రం ముందడుగు వేయలేకపోయిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. కేబినెట్ తాజా నిర్ణయంతో తెలంగాణలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో సాగు చేస్తున్న 13 లక్షల మందికి పైగా రైతులకు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

9 సార్లు లేఖ రాసినా స్పందించలే

తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయానికి స్థలం కేటా యించాలని 2014 నుంచి 2019 వరకు 9 సార్లు లేఖ రాసినా కేసీఆర్ స్పందించలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. అనేక ఉత్తరాల తర్వాత 2019లో ఏటూరు నాగారంలో169.35 ఎకరాల భూమిని గుర్తించినట్లు చెప్పినా.. దాన్ని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ)కి బదిలీ చేశారని చెప్పారు. చివరకు ములుగులో స్థలం అప్పగించడంతో కేంద్రం వెంటనే వర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. రూ.889 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీకి యూజీసీ నిధులు సమకూర్చుతుందని చెప్పారు. వర్సిటీ రెండు దశల్లో ఏర్పాటు కానుందని, మొదటి దశ మూడేండ్లలో, రెండో దశ తర్వాత నాలుగేండ్లలో పూర్తవుతుందని చెప్పారు. దాదాపు 30 శాతం గిరిజన జనాభా ఉన్న ములుగు జిల్లాలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. గిరిజన సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. వనదేవతలైన సమ్మక, సారక్క పేర్లను యూనివర్సిటీకి పెట్టినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో పసుపు బోర్డు..

కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో పసుపు బోర్డు పని చేస్తుందని కిషన్​ రెడ్డి చెప్పారు. ‘ఇందులో ఆయూష్, ఫార్మాస్యూటికల్స్, అగ్రికల్చర్, ఫ్యామిలీ వెల్ఫేర్, కామర్స్ & ఇండ స్ట్రీ శాఖ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మూడు రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారులు (రొటేషన్ పద్ధతిలో), పసుపు పరిశోధనల్లో భాగస్వామ్యమైన సంస్థలు.. పసుపు రైతుల ప్రతినిధులు, ఎగుమతిదారులు సభ్యులుగా ఉంటారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ బోర్డుకు సెక్రటరీని నియమి స్తుంది’ అని కిషన్​రెడ్డి తెలిపారు.

పసుపు రైతుల్లో ఆనందం

తెలంగాణలో నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు నిర్ణయంతో పసుపు రైతుల్లో ఆనందం కనిపిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. 30–40 ఏండ్లుగా తెలంగాణలో పసుపు బోర్డు డిమాండ్ ఉందని చెప్పారు. దేశంలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి 20 రాష్ట్రాల్లో పసుపు పండుతుందని చెప్పారు. ప్రపంచంలో పసుపు పండించే, వినియోగించే, ఎగుమతి చేసే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. పసుపు ద్వారా కలిగే ఆరోగ్య లాభాలను, వైద్య సంబంధ పరిశోధనలను ప్రోత్సహించాలని అన్నారు. స్పైస్ బోర్డుతో అనుసంధానం చేసుకుంటూ.. ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. ముందుకు వెళ్లడం ద్వారా పసుపు ఉత్పత్తి రంగాన్ని మరింతగా ప్రోత్సహిస్తామని కిషన్‌రెడ్డి వివరించారు.