ఇప్పటి వరకు దళితబంధు ఇచ్చింది 5,500 మందికే

ఇప్పటి వరకు దళితబంధు ఇచ్చింది 5,500 మందికే
  • మార్చి 31 కల్లా ఇస్తమన్నది 40 వేల మందికి
  • ఇప్పటిదాకా ఇచ్చింది 5,500 మందికే
  • డేట్లు, డెడ్‌‌లైన్లతోనే కాలం వెళ్లదీస్తున్న సర్కారు
  • ఎస్సీ లోన్లకు అప్లై చేసినోళ్లకు దళిత బంధు రాదంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: ‘‘నా నోట్లకెల్లి ఈ మాట ఎల్లిందో లేదో.. మీరు పది లక్షల శ్రీమంతులైన్రు’’ అని సీఎం కేసీఆర్ చెప్పి నెలలు గడుస్తున్నా అర్హులకు దళితబంధు అందడం లేదు. పథకం విషయంలో ప్రభుత్వం చెబుతున్న మాటలకు, తీసుకుంటున్న చర్యలకు పొంతన ఉండటం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్కీం తెచ్చామని గొప్పలు చెబుతున్నా.. అమలులో మాత్రం ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లు మారింది. యూనిట్ల గ్రౌండింగ్ నత్తనడకన సాగుతోంది. మార్చి 31 కల్లా 40 వేల మందికి గ్రౌండింగ్ చేస్తమని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటిదాకా 5,500 మందికి మాత్రమే పూర్తి చేసింది. అంటే అనుకున్న దానిలో 14% మాత్రమే కంప్లీట్ చేసింది. అప్పుడిస్తం.. ఇప్పుడిస్తం అని డేట్లు, డెడ్‌‌లైన్లు మార్చుకుంటూ పోవడం మినహా టార్గెట్‌‌ను చేరుకోవడం లేదు.

డిపాజిట్ చేయలె.. చేసినా గ్రౌండింగ్ అవ్వలె

రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు స్కీం కింద ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించింది. ముందుగా హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలో పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌గా ప్రారంభించింది. అక్కడ 20 వేల మంది అకౌంట్లలో డబ్బులు జమ చేసినా.. పైసలు తీసుకోకుండా వాటిని ఫ్రీజ్​ చేశారు. ఇప్పటివరకు యూనిట్లను గ్రౌండింగ్‌‌ చేయలేదు. ఆ తర్వాత ఎంపిక చేసిన నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక ప్రతి నియోజకవర్గానికి 100 మంది దళితులకు పథకాన్ని వర్తింపజేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,180 కోట్లు రిలీజ్‌‌ చేసినా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు. ఆ డబ్బులు ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మందిలో ఇప్పటి దాకా 25 వేల మందికి మాత్రమే డబ్బు డిపాజిట్‌‌ చేశారు. డిపాజిట్‌‌ చేసినా యూనిట్లను గ్రౌండింగ్‌‌ చేయడంలేదు. 5,500 మందికే గ్రౌండింగ్‌‌ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.

తేదీలు మారుతున్నయే కానీ..

హుజూరాబాద్‌‌తో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో పథకాన్ని వేగంగా అమలు చేస్తామని సర్కార్​ చెప్పింది. ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి, మార్చి7 నాటికి 100% గ్రౌండింగ్‌‌ చేస్తామని తెలిపింది. దీనిపై మంత్రులు, సీఎస్‌‌.. కలెక్టర్లతో రివ్యూలు కూడా నిర్వహించారు. కానీ మార్చి రెండో వారం దాకా జిల్లాల్లో ఎంపిక ప్రక్రియే కొలిక్కి రాలేదు. దీంతో మంత్రులు, అధికారులు మళ్లీ రివ్యూ చేసి.. మార్చి 31లోగా అందరికీ ఇవ్వాలని ఆదేశించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. తేదీలు మారుతున్నాయే కానీ పథకం అమలులో పురోగతి లేదు.

ఎస్సీ కార్పొరేషన్ తిరకాసు!

ఎస్సీ కార్పొరేషన్‌‌ కింద సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకున్నోళ్లకు దళితబంధు ఇవ్వబోమని కార్పొరేషన్‌‌ అధికారులు ఫీల్డ్‌‌ లెవల్‌‌లో దళితులకు స్పష్టం చేస్తున్నారు. దీంతో అర్హులంతా తమకు పథకం వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి దళిత బంధుకు ఇప్పటి దాకా ఎలాంటి గైడ్‌‌లైన్స్‌‌ రూపొందించలేదు. అర్హులెవరు, ప్రాతిపదికత ఏమిటి, ఏ లెక్కన గుర్తించాలి అనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఎమ్మెల్యేలే తమకు నచ్చినట్లు లబ్ధిదారులను ఫైనల్‌‌ చేస్తున్నారు. ఒకానొక దశలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇస్తామని సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. మరోవైపు ఏడాది కిందటే ఎస్సీ లోన్లకు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు ఒక్కరికీ రుణం ఇవ్వలేదు. అటు దళిత బంధు లేక, ఇటు లోన్లు రాక ఎస్సీలు ఇబ్బందులు పడుతున్నారు.