కేయూలో డిగ్రీ, పీజీ మెమోల జారీలో జాప్యం

కేయూలో డిగ్రీ, పీజీ మెమోల జారీలో జాప్యం
  • సిబ్బంది నిర్లక్ష్యంతో స్టూడెంట్లకు ఇబ్బందులు
  • ఓడీల కోసం ఎగ్జామినేషన్ బ్రాంచ్ చుట్టూ ప్రదక్షిణలు
  • పట్టించుకోని ఉన్నతాధికారులు

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన భూసాని రాజు డిగ్రీ చదివాడు. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో బస్​లో ప్రయాణం చేస్తుండగా.. డిగ్రీ మెమోలు మిస్ ​అయ్యాయి. అదే నెల 7న పోలీసులకు కంప్లైంట్ చేశాడు. జాబ్​ నోటిఫికేషన్లు రిలీజ్​ అవుతున్న నేపథ్యంలో వెంటనే యూని వర్సిటీలో అప్లై చేసి ఫీజు కూడా కట్టాడు. కానీ రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు సర్టిఫికెట్​ మాత్రం అందించలేదు. ఎగ్జామి నేషన్​ బ్రాంచ్​కు వెళ్లి అడిగితే టైం పడుతుం దని చెప్పడం తప్ప.. ఎలాంటి యాక్షన్​ తీసు కోవడం లేదు. దీంతో రాజు ఎగ్జామినేషన్​ డిపార్ట్​మెంట్ ​చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు.

హనుమకొండ, వెలుగు: జాబ్​ నోటిఫికేషన్లు రిలీజ్​అవుతున్న వేళ కాకతీయ యూనివర్సిటీ ఆఫీసర్ల నిర్లక్ష్యం స్టూడెంట్ల పాలిట శాపంగా మారింది. కష్టపడి డిగ్రీలు, పీజీలు చదివినా.. ఆయా కోర్సులు పూర్తి చేసినట్లుగా సర్టిఫికెట్లు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం ఫీజు కట్టినా.. 
ఎగ్జామినేషన్​ బ్రాంచ్​లో సిబ్బంది కొరతతోపాటు ఉన్నతాధికారుల అలసత్వం కారణంగా సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో తత్కాల్‌ సర్టిఫికెట్‌ కోసం రూ.వెయ్యి అదనంగా కట్టినా చేతికందకపోవడంతో ఎగ్జామినేషన్​ బ్రాంచ్​చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఓవైపు ఉద్యోగాలకు అప్లై చేసుకునే తేదీ దగ్గరపడుతుండటం.. కష్టపడి చదివిన డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు జారీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఎంతోమంది మనోవేదనకు గురవుతున్నారు. 
రోజుల తరబడి పడిగాపులు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్​ జిల్లాలు ఉండగా.. దాదాపు 550 వరకు కాలేజీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 70 వేల మంది స్టూడెంట్లు డిగ్రీలు, పీజీలు పూర్తి చేస్తుండగా అందులో చాలామంది వివిధ కారణాల వల్ల సర్టిఫికెట్లు సకాలంలో తీసుకోలేకపోతున్నారు.  ఆ తరువాత  కేయూలోని ఎగ్జామినేషన్​ బ్రాంచ్​కు వెళ్తే అక్కడి సిబ్బంది స్టూడెంట్లను రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు.

ఒకవేళ ఏవైనా మెమోలు, సర్టిఫికెట్లు మిస్​ అయ్యాయంటే ఇక అంతే సంగతులు. వాటి డూప్లికేట్స్​ పొందడానికి లీగల్ ప్రాసెస్​ అంతా పూర్తి చేసుకున్నా.. సర్టిఫికెట్ ​ముఖం చూడటానికి నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సర్టిఫికెట్ల కోసం నిర్ణీత ఫీజులు చెల్లించడానికి గతంలో ఆఫ్​ లైన్​ విధానం ఉండేది. రెండేండ్ల కిందటి నుంచి కేవలం ఆన్​లైన్​ విధానాన్ని మాత్రమే అవలంబిస్తున్నారు. దీంతో ఆన్​లైన్ ​పేమెంట్స్ వెరిఫికేషన్​ చేయడానికే రెండు, మూడు రోజులు పడుతోందని ఎగ్జామినేషన్​ బ్రాంచ్​ సిబ్బంది చెబుతున్నారు. ఆన్​లైన్​తో పాటు ఆఫ్​ లైన్​ విధానం కూడా ఉంటే స్టూడెంట్లకు కొంత మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గందరగోళంలో స్టూడెంట్లు
కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్​ బ్రాంచ్​కు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో స్టూడెంట్లు వస్తున్నారు. కానీ అక్కడ హెల్ప్​డెస్క్ అంటూ ఏమీ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జామినేషన్​ బ్రాంచ్​లో ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని వాపోతున్నారు. అంతేకాకుండా వివిధ సర్టిఫికెట్ల జారీ కోసం ఫీజులు కట్టించుకుంటున్న ఆఫీసర్లు.. ఏ సర్టిఫికెట్​ఎన్ని రోజుల్లో జారీ చేస్తారో కూడా చెప్పడం లేదు. ఇప్పటికే వివిధ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయం దగ్గర పడుతుండటంతో స్టూడెంట్లు గందరగోళానికి గురవుతున్నారు.  ఇకనైనా కేయూ ఎగ్జామినేషన్​ డిపార్ట్​మెంట్​పై ఉన్నతాధికారులు ఫోకస్​ పెట్టి నిర్దిష్ట ప్రణాళికా మేరకు సర్టిఫికెట్లు జారీ చేయాలని, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి స్టూడెంట్లకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్టూడెంట్​ యూనియన్​నాయకులు డిమాండ్​ చేస్తున్నారు. 
సిబ్బంది లేరు.. సంతకాలు చేయరు
ఇటీవల పోలీస్ ​రిక్రూట్​మెంట్​తో పాటు గ్రూప్​ వన్​ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో అప్పటినుంచి వివిధ సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీకి స్టూడెంట్ల రాక ఎక్కువైంది.  ఒరిజినల్​ డిగ్రీలు(ఓడీ), ఇతర సర్టిఫికెట్ల కోసం అప్లై చేసుకున్నా అక్కడి స్టాఫ్ ​సరిగా పట్టించు కోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. పరీక్షల విభాగంలో ఇదివరకే సిబ్బంది కొరత ఉండగా.. అందులో పని చేసే ఇద్దరు ఉద్యోగులు కొంతకాలం కిందట యాక్సిడెంట్ లో చనిపోయారు.
వారి స్థానంలో కొత్తగా ఎవరినీ తీసుకోలేదు. డైలీ వేజ్ ​వర్కర్లతో నెట్టుకొస్తున్నారు. వారికి వేతనాలు పెద్దగా లేకపోవడంతో ఆ సిబ్బంది కూడా డ్యూటీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొంతమందికి ఆన్​లైన్ ​వర్క్స్​పై అవగాహన లేకపోవడం కూడా సర్టిఫికెట్ల జారీలో జాప్యానికి కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఎగ్జామినేషన్స్​కంట్రోలర్ ​ప్రొఫెసర్ ​మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గా, ఈసీ మెంబర్​గా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో సర్టిఫికెట్లపై సంతకాలు చేయడంలో జాప్యం జరుగుతోంది. 
సర్టిఫికెట్లు ఇస్తలేరు
మా తమ్ముడి డిగ్రీ సర్టిఫికెట్​ కోసం అప్లై చేసి రెండు నెలలవుతోంది. రోజూ వచ్చి ఎగ్జామినేషన్​బ్రాంచ్​లో అడుగుతున్న. సిబ్బంది సరిగా రెస్పాండ్​ అవ్వట్లేదు. కొన్నిసార్లు సంతకాలు కాలేదని చెప్పి పంపించేస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  దీనిపై ఆఫీసర్లు చర్యలు తీసుకుని స్టూడెంట్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.  - మున్న గణేశ్, యూనివర్సిటీ స్టూడెంట్
స్టూడెంట్లకు న్యాయం చేయాలె
యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్లు తీసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. లాంగ్, షార్ట్​మెమోస్, కాన్వొకేషన్, ట్రాన్స్​స్క్రిప్స్​ కోసం అప్లై చేసుకుని నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల స్టూడెంట్లు లాస్​ కావాల్సి వస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు యాక్షన్​ తీసుకోవాలి. - కల్లెపల్లి ప్రశాంత్​, యూనివర్సిటీ స్టూడెంట్

 

 

 

ఇవి కూడా చదవండి

లక్షల్లో ఫాలోవర్లు..ఒక్క పైసా తీసుకోడు 

మట్టి పాత్రలో ద్రాక్షపండ్లు..ఆరు నెలల వరకు చెడిపోవు

ఊరు చిన్నదే.. ఎంజాయ్​మెంట్​కు మాత్రం తక్కువ లేదు