ఖమ్మం, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తికావడం, అధికారులు అంతగా పట్టించుకోకపోవడంతో అభివృద్ధి పనులు నత్తనడక సాగుతున్నాయి. నగరంలోని వివిధ డివిజన్లలో డ్రెయిన్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
బైపాస్ రోడ్డుపై రాపర్తి నగర్ సమీపంలో నెల రోజుల నుంచి డ్రెయిన్ల నిర్మాణానికి రోడ్డు తవ్వారు. దీంతో ప్రతి రోజూ సాయంత్రం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. నగరంలో ఇలా చాలా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. గత పాలకవర్గ ఐదేళ్ల పదవీ కాలం గతనెల 8వ తేదీతో ముగిసింది.
జిల్లా కలెక్టరే ప్రస్తుతం కార్పొరేషన్ కు స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. అధికారులు ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
