రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించేదెన్నడో..?

రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించేదెన్నడో..?
  • 2018 సెప్టెంబర్​లో అనుమతినిచ్చిన కేంద్రం
  • అనువైన స్థలం చూపించని గత బీఆర్​ఎస్​ సర్కార్​
  • 2025 జనవరిలో కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చినా కదలని జిల్లా యంత్రాంగం
  • పార్లమెంట్​లో ప్రస్తావించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో వంద పడకల ఎంప్లాయిస్​ స్టేట్​ఇన్సూరెన్స్​ (ఈఎస్​ఐ) హాస్పిటల్​నిర్మాణం ముందుకు సాగడం లేదు. 2018లోనే హాస్పిటల్ నిర్మాణానికి  కేంద్రం నుంచి  అనుమతి లభించినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అనువైన స్థలం చూపించలేదు. ఆ తర్వాత 2022లో సమాధుల పక్కన, చెత్త డంపింగ్​యార్డు స్థలాన్ని చూపించారు.  ఈ స్థలానికి రోడ్​ కనెక్టివిటీ లేకపోవడంతో ఈఎస్​ఐసీ ఆఫీసర్ల బృందం దీన్ని రిజెక్ట్​ చేసింది.  

2023లో వచ్చిన ఈఎస్​ఐసీ కొత్త నిబంధనల ప్రకారం అనువైన స్థలాన్ని ఎంపిక చేయగా 2025 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇప్పటి వరకు పెద్దపల్లి జిల్లా యంత్రాంగం దీని నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు. రామగుండం ఈఎస్​ఐ హాస్పిటల్​ నిర్మాణం విషయంలో జరుగుతున్న తాత్సారంపై తాజాగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్​లో ప్రస్తావించారు. వంద పడకల ఈఎస్​ఐ హాస్పిటల్​ ఏర్పాటు కోసం ఈ ప్రాంత కార్మికులు, వారి కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

రూ.21 వేల వేతనం వచ్చే వారికి ఈఎస్​ఐ వైద్య సేవలు...

ఏదైనా ఒక సంస్థలో పది మంది, అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తూ వారు ప్రతి నెలా రూ.21 వేల లోపు వేతనం పొందితే వారికి ఎంప్లాయిస్​ స్టేట్​ ఇన్సూరెన్స్​ (ఈఎస్​ఐ) వర్తింపచేస్తారు. కార్మికుడు పొందే వేతనంలో 0.75 శాతం కార్మికుడి నుంచి, 3.25 శాతం మేనేజ్​మెంట్​ నుంచి కలిపి మొత్తం నాలుగు శాతం ఈఎస్​ఐకి జమచేస్తారు. వేతనంలో ఈఎస్​ఐ కింద డబ్బులు జమచేసే కార్మికుడికి, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్​ఐ హాస్పిటళ్ళలో వైద్య సేవలందిస్తారు. 

రామగుండం బ్రాంచ్​ పరిధిలో ఐదు జిల్లాలు...

ఈఎస్​ఐ రామగుండం బ్రాంచ్​ పరిధిలోకి పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్​, సిరిసిల్ల జిల్లాలకు చెందిన సుమారు 60 వేల మంది కార్మికులు వస్తారు. వీరిలో ఈఎస్​ఐ డబ్బులు చెల్లించే ఎన్టీపీసీ, ఆర్​ఎఫ్​సీఎల్​, సింగరేణి, సిమెంట్​ ఫ్యాక్టరీ, ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్​ కాలేజీలు, షాపింగ్​ మాల్స్​, మున్సిపల్​ కార్మికులు, బీడీ కార్మికులు, వీవింగ్​ మిల్లు కార్మికులకు వైద్య సేవలందించాలి. ఇందుకోసం రామగుండం (ఎన్టీపీసీ), బసంత్​నగర్​, మంచిర్యాలలో మాత్రమే ఈఎస్​ఐ డిస్పెన్సరీలు నడుస్తున్నాయి. 

జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్​ జిల్లాలకు చెందిన కార్మికులకు ఎక్కడా ఈఎస్​ఐ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయకపోవడంతో వారు వైద్య సేవలకు నోచుకోవడం లేదు. ఒకవేళ ఈ జిల్లాలకు చెందిన వారు వైద్యం పొందాలంటే బసంత్​ నగర్​ లేక ఎన్టీపీసీ వరకు వ్యయప్రయాసాల కోర్చి వెళ్లక తప్పడం లేదు. పెద్ద జబ్బులు వస్తే వరంగల్​, హైదరాబాద్​ నాచారం హాస్పిటల్​, సనత్​నగర్​లోని ఈఎస్​ఐసీ మెడికల్​ కాలేజీ, హాస్పిటల్​కు రెఫరల్​ మీద వెళుతున్నారు.

2023లో కొత్త నిబంధనలతో మళ్లీ  ప్రతిపాదన...

గతంలో ఐదెకరాల స్థలం ఉంటేనే ఈఎస్​ఐ హాస్పిటల్​ నిర్మించవచ్చనే నిబంధనలను మార్పు చేసి 2023లో కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. దీంతో రామగుండం పట్టణంలో మూడు ఎకరాల 30 గుంటల స్థలం అందుబాటులో ఉండగా ఆ స్థలం కబ్జా కాకుండా కార్పొరేషన్​ ఆధ్వర్యంలో చుట్టూ ప్రహారీ నిర్మించారు. ఈ స్థలంలోనే వంద పడకల హాస్పిటల్​ నిర్మాణం చేపడతామని మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు పంపగా 2023 డిసెంబర్​ 12న జరిగిన ఈఎస్​ఐ కార్పొరేషన్​192వ మీటింగ్‌‌‌‌లో రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తూ ఆమోదముద్ర వేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2025 జనవరి 8న హాస్పిటల్​నిర్మాణానికి అనుమతిచ్చింది. ఇప్పటికీ ఏడు నెలలు గడుస్తున్నా జిల్లా యంత్రాంగం రామగుండంలో ఈఎస్​ఐ హాస్పిటల్​ నిర్మాణం విషయంలో ముందుకు కదలడం లేదు. ఈ విషయమై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్​లో ప్రస్తావనకు తీసుకువచ్చారు. 

కలెక్టర్​ నిర్లక్ష్యంతోనే ఈఎస్​ఐ హాస్పిటల్​ నిర్మాణంలో ఆలస్యం

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో మంజూరైన ఈఎస్ఐ హాస్పిటల్​ నిర్మాణం ఇంకా ప్రారంభం కాకపోవడం శోచనీయం.  కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు కేటాయించి ముందుకు వచ్చినా, జిల్లా యంత్రాంగం మాత్రం ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడం బాధాకరం. జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. రామగుండంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో వేలాది మంది కార్మికులు ఉన్నప్పటికీ...ప్రాథమిక హెల్త్ సెంటర్ మినహా ఎలాంటి మెరుగైన వైద్య సదుపాయాలు వారికి అందడం లేదు. 

అనారోగ్యంతో బాధపడే కార్మికులు హైదరాబాద్‌‌‌‌ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. జిల్లా యంత్రాంగం స్పందించి హాస్పిటల్​ నిర్మాణం కోసం ముందుకు కదలాలి. రామగుండంలో ఈఎస్​ఐ హాస్పిటల్​ నిర్మాణం పూర్తయ్యేవరకు పోరాటం ఆపేది లేదు. 

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ