13 రోజులైనా బియ్యం రాలే...

13 రోజులైనా బియ్యం రాలే...


మెదక్  (శివ్వంపేట), వెలుగు:  ఆహార భద్రత కింద ప్రభుత్వం పేదలకు ఇస్తున్న బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతోంది.  రేషన్‌‌ డీలర్లు ప్రతినెలా1వ తేదీ నుంచి 15 లోగా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.  కానీ, మే నెల ప్రారంభమై 13 రోజులైనా స్టాక్‌‌ పాయింట్ల నుంచి రేషన్ షాప్‌‌లకు బియ్యం సప్లై కాలేదు. దీంతో  రేషన్‌‌ డీలర్లు ఖాళీగా కూర్చుంటుండగా.. లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు.  కాగా, సివిల్‌‌ సప్లై ఆఫీసర్లు కాంట్రాక్టర్లకు ఆర్‌‌‌‌వో(రిలీజింగ్ ఆర్డర్) లు ఇవ్వకపోవడంతోనే వాళ్లు బియ్యం సప్లై చేయడం లేదని తెలిసింది. జిల్లాలో రెండుమూడు నెలలుగా తెట్టెలు కట్టిన బియ్యం రావడం, పురుగులు ఉండడం ఇందుకు కారణమని సమాచారం.  

521 రేషన్ షాపులు

జిల్లాలోని 21 మండలాల పరిధిలో 521 రేషన్​ షాప్‌‌లు ఉండగా, వాటి పరిధిలో 2,14,878 రేషన్​ కార్టులు ఉన్నాయి. ఇందులో తెలుపు కార్డులు 2,00,949 కాగా, అంత్యోదయ కార్డులు 13,860, అన్నపూర్ణ కార్డులు 69 ఉన్నాయి.  జిల్లాలోని ఏడు మండల​ లెవల్​ స్టాక్‌‌ పాయింట్ల(ఎంఎల్​ఎస్) ద్వారా రేషన్​ షాప్​లకు బియ్యం సరఫరా  చేస్తున్నారు. ప్రతినెలా 30 తేదీలోగా రేషన్ షాప్ లకు బియ్యం సప్లై చేస్తే.. నెక్ట్స్‌‌ మంత్ ఫస్ట్‌‌ నుంచి పంపిణీ ప్రారంభిస్తారు. కానీ, రెండు వారాలకు దగ్గరొస్తున్న ఈ నెల బియ్యమే రాలేదు. 

బియ్యం నిల్వలు ఉన్నా.. 

గోడౌన్లలో బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ సివిల్ సప్లై అధికారులు కాంట్రాక్టర్లకు ఆర్వోలు ఇవ్వడం లేదని తెలిసింది.  కొన్నినెలలుగా రేషన్​ షాప్​లకు వస్తున్న బియ్యం తుట్టెలు కట్టి, పురుగులు పట్టి అధ్వాన్నంగా ఉంటున్నాయి.  కొన్నిషాప్​లకు వస్తున్న బియ్యంలో తౌడు, నూకలు ఉంటున్నాయి. ఈ బియ్యం పంపిణీ చేస్తుండడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. చాలాచోట్ల  బియ్యాన్ని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఈ కారణంతోనే క్వాలిటీ కంట్రోల్ అధికారులు గోడౌన్లలో బాగాలేని బియ్యాన్ని పంపడం లేదు. అంతేకాదు వివిధ రైస్​ మిల్లల నుంచి గోడౌన్​లకు వచ్చిన బాగాలేని బియ్యాన్ని అన్​ లోడ్ చేసేందుకు క్యూసీ ఆఫీసర్లు పర్మిషన్​కూడా  ఇవ్వడం లేదు.  అందుకే పంపిణీకి రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నా.. బియ్యం సరఫరా కాలేదు.  గత నెలలో పంపిణీ చేయగా మిగిలిన స్టాక్‌‌ కొందరు డీలర్లు ఇస్తుండగా.. మెజారిటీ షాప్‌‌లు స్టాక్​ లేక ఖాళీగానే ఉంటున్నాయి.  

నెలంతా చాకిరీ అవుతోంది

సరైన సమయానికి బియ్యం సప్లై కాకపోవడంతో నెలంతా చాకిరీ చేయాల్సి వస్తోంది.  పదో తారీకు వరకు బియ్యం రాకపోతే ప్రజలకు ఎప్పుడు ఇయ్యాలి. ఇంకా బియ్యం రాలేవా అని గ్రామస్తులు రోజు తిరిగి పోతున్నారు. వాళ్లకు ఏం చెప్పాల్నో సమజైతలేదు.

- పాపయ్య, రేషన్​ డీలర్​, చిన్నగొట్టిముక్కుల

పంపిణీ గడువు పొడిగించాలి

 ప్రతినెలా 1తేదీలోగా  షాప్​లకు బియ్యం చేరితే 15లోగా పంపిణీ చేయడం సాధ్యమవుతుంది. కానీ, ఈ సారి ఇంత వరకు  బియ్యం సరఫరా కాలేదు.  దీంతో డీలర్లకు చాలా ఇబ్బంది కలుగుతోంది.  అధికారులు స్పందించి వెంటనే  బియ్యం సప్లై చేయడంతో పాటు పంపిణీ గడువు పొడిగించాలి. 

- ఆనంద్​, రేషన్​డీలర్స్​అసోసియేషన్​ జిల్లా అధ్యక్షులు