భారీగా పెరిగిన ఫ్లైట్ చార్జీలు

భారీగా పెరిగిన ఫ్లైట్ చార్జీలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన ప్రయాణం మరింత ప్రియంగా మారుతోంది. అధిక గిరాకీ వల్ల కొన్ని కీలక అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో టికెట్ల ధరలు గత నెల రోజుల వ్యవధిలో గణనీయంగా పెరిగాయి. ట్రావెల్‌ వెబ్‌సైట్‌ ఈజ్‌మైట్రిప్‌.కామ్‌ డేటా ప్రకారం ఎకానమీ క్లాస్‌ టికెట్‌ ధరలు.. ఢిల్లీ నుంచి యూఎస్‌లోని నెవార్క్‌ (న్యూజెర్సీ)కు జూలైలో రూ.69,034 ఉండగా, ఇప్పుడు రూ.87,542కు పెరిగింది. ముంబై నుంచి మాస్కోకు టికెట్‌ ధర రూ.43,132 నుంచి రూ.85,024కు, ముంబయి నుంచి దోహాకు టికెట్‌ ధర రూ.11,719 నుంచి రూ.18,384కు పెరిగింది. 

రీసెంట్‌గా చాలా దేశాల్లో ఇండియా నుంచి వచ్చే వారికి ప్రయాణ నిబంధనలు సడలించారు. దీంతో అక్కడకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. విమాన టికెట్‌ ధరలు పెరగడానికి ఇదే కారణమని ఈజీమైట్రిప్‌.కామ్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు నిశాంత్‌ పిత్తి తెలిపారు. బ్రిటన్‌ (యూకే)లో కాలేజీల్లో జాయినింగ్‌కు సమయం కావడంతో ఢిల్లీ నుంచి లండన్‌ మార్గంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ టికెట్‌ ధర ఆగస్టు 26వ తేదీకి ఎకానమీ క్లాస్ టికెట్‌కు రూ.3.95 లక్షలు పలుకుతోందని కేంద్ర హోంశాఖ ఇంటర్‌స్టేట్‌ కౌన్సిల్‌ సెక్రెటేరియట్‌ సెక్రెటరీ సంజీవ్‌ గుప్తా ట్వీట్‌ చేశారు. విస్తారా, ఎయిరిండియా విమానాల్లో ఇదే తేదీన ప్రయాణానికి టికెట్‌ ధర రూ.1.2 లక్షలు, రూ.2.3 లక్షలు ఉందని ఆయన పేర్కొన్నారు. సర్వీసులు పెరిగితే, ఛార్జీలు దిగి వస్తాయని వివరించారు.