ఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ..ఏక్యూఐ 426గా నమోదు

ఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ..ఏక్యూఐ 426గా నమోదు

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం మరింత పెరిగింది. గాలి నాణ్యత సివియర్ కేటగిరీకి పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఓవరాల్ గా బుధవారం 354గా నమోదు కాగా, గురువారం 426గా నమోదైంది. కొన్ని ఏరియాల్లో అయితే ఇంతకంటే ఎక్కువే రికార్డయింది. ఆనంద్ విహార్, జహంగీర్ పూర్ లో 460, బవానాలో 456, రోహిణిలో 453గా ఏక్యూఐ నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. పంజాబ్ లోని పొలాల్లో గడ్డి కాల్చడంతోనే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. బుధవారం 3,634 చోట్ల గడ్డి కాల్చారని,  ఢిల్లీ కాలుష్యంలో ఫార్మ్ ఫైర్స్ వాటా 38 శాతానికి పెరిగిందని, ఈ సీజన్ లో ఇదే హయ్యెస్ట్ అని పేర్కొంది. 

పరిష్కరించండి.. లేదంటే దిగిపోండి: కేజ్రీవాల్  

ఢిల్లీలో కాలుష్యంపై బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆప్ సర్కార్ ఉన్న పంజాబ్​లో ఫార్మ్ ఫైర్స్ 19% పెరిగాయని,  హర్యానాలో 30%  తగ్గాయని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. దీన్ని బట్టి ఢిల్లీని ఎవరు గ్యాస్ చాంబర్​లా మారుస్తున్నారో అర్థమవుతోందంటూ మండిపడ్డారు. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ స్పందిస్తూ..‘‘యూపీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్​లో ఏక్యూఐ సమానంగా ఉంది. కానీ, ఢిల్లీ..పంజాబ్ లోనే సమస్య ఉన్నట్లు, దేశంలో పొల్యూషన్​కు ఈ 2 రాష్ట్రాలే కారణమన్నట్లు మాట్లాడుతున్నారు” అని  మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కాలుష్యాన్ని నివారించలేకపోతే, గద్దె దిగిపోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. మరోపక్క ఢిల్లీలో కాలుష్యం పెరగడంతో జనం దగ్గు, జలుబు, శ్వాస, ఆస్తమా సమస్యలతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.