మహానగరాల్లో వాయు కాలుష్యం కట్టడి ఎలా?

మహానగరాల్లో  వాయు కాలుష్యం కట్టడి ఎలా?

శీతాకాలం ప్రారంభం కాగానే 3.4 కోట్ల జనాభా కలిగిన ఢిల్లీవాసుల ఊపిరితిత్తులు పొగచూరు తుంటాయి. గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కోరలు చాచడంతో వర్క్ ఫ్రమ్‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌, విద్యాలయాలు మూసివేసి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ క్లాసులను తెరవడం, సగం మందితో కార్యాలయాల నిర్వహణ, వాహనాల క్రమబద్ధీకరణ, కృత్రిమ వర్షాలతో విషతుల్యమైన స్మోగ్‌‌‌‌‌‌‌‌ (స్మోక్‌‌‌‌‌‌‌‌ + ఫాగ్‌‌‌‌‌‌‌‌) తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతాయి.

భవన  నిర్మాణాల పనులు నిలిపివేతలు,  విమాన రాకపోకలకు ఇబ్బందులు,  చీపుర్లతో ఊడ్వకుండా తడి గుడ్డలతో తుడవడం,  వాటర్‌‌‌‌‌‌‌‌  ట్యాంకర్లతో నీటిని చల్లించడం, అనవసర వాహన రద్దీని నియంత్రించడం జరుగుతోంది.  వ్యాపార సముదాయాల పని సమయాల్లో కోతలు, ప్రజలు బయట తిరగవద్దని హెచ్చరికలు చేయడం లాంటి అసాధారణ చర్యలకు ప్రభుత్వాలు పూనుకోకతప్పని పరిస్థితులు అనివార్యంగా మారుతున్నాయి.  

గాలి నాణ్యత సూచీ ఏటా  గరిష్ట స్థాయి దాదాపు 500 వరకు చేరడం చూస్తుంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం సురక్షిత స్థాయి 15 వరకు మాత్రమే ఉండాలి.  కానీ దాని కన్నా 30 రెట్లకు పైగా అధిక  పిఎం-2.5 కాలుష్య సూచీ చూపడం ప్రమాద హెచ్చరికగా తీసుకోవాలి. ప్రతి ఏటా శీతాకాల సీజన్​లో   గాలి కాలుష్య భూతం మహానగరాలతోపాటు ఢిల్లీ వాసులకు  నరకం  చూపిస్తున్నది. 

గాలి కాలుష్యానికి ప్రధాన కారణాలు

 ఢిల్లీ లాంటి అధిక గాలి కాలుష్య పరిస్థితులు గుర్‌‌‌‌‌‌‌‌గావ్‌‌‌‌‌‌‌‌, పాట్నా, జైపూర్‌‌‌‌‌‌‌‌, లక్నో,  ఘజియాబాద్‍, కొల్‌‌‌‌‌‌‌‌కతా, ముంబయి, బెంగళూరు,హైదరాబాద్​  లాంటి నగరాల్లో కూడా కొంతవరకు గమనించడం జరిగింది. భారత్‌‌‌‌‌‌‌‌లో బొగ్గు ఆధారిత విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి సగానికి పైగా జరగడం, అపరిమిత వాహనాలు విడిచే పొగ, నిర్మాణరంగ ధూళి, గాలి వీచకపోవడం, శీతల వాతావరణం కమ్మేయడం,  మంచు కురవడం, పరిశ్రమలు వదిలే  పొగలు,  సమీప రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను బహిరంగంగా కాల్చి వేయడం, పర్వదినాల్లో బాణాసంచా కాల్చడం లాంటి పలు కారణాలతో నగరాలు గాలి కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. పాఠశాలలు మూసివేయడం,  గర్భిణులు, -పిల్లల్ని 
గృహ నిర్బంధంలో ఉండాలని అనడం, తప్పనిసరి అయితేనే బయటకు రావాలని సూచించడం లాంటి  చర్యలు తీసుకోవడం అనివార్యం అవుతున్నది. 

గాలి కాలుష్య నియంత్రణ మార్గాలు

శిలాజ ఇంధన వాహనాలను నియంత్రించిఈవీ వాహనాలను ప్రోత్సహించాలి.  పరిశ్రమలను నగరాల నుంచి తరలించడం, నిర్మాణ రంగాలకు తాత్కాలిక సెలవులు ప్రకటించడం,  వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతలను నిషేధించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.  బొగ్గు  ఆధార  విద్యుత్తు/ఇతర ఉత్పత్తులకు బ్రేకులు వేయడం, వంట చెరుకు/ బొగ్గు/ పిడకలతో వంటలు చేయడాన్ని తగ్గించడం, హరిత క్షేత్రాలను పెంచడం లాంటి పటిష్ట చర్యలు అమలు చేయాలి. దీంతో  కొంతవరకు నగరవాసులకు ఊపిరి పీల్చడం తేలికవుతుందని తెలుసుకోవాలి. 

ప్రభుత్వాలు కళ్లు తెరవాలి

మహానగరాలు కాలుష్య కేంద్రాలుగా మారి మరింత ప్రమాదకర స్థాయికి చేరక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. పరిస్థితులు మరింత విషమించకుండా తక్షణమే మహానగర అభాగ్యులకు ఆయురారోగ్యాలను ప్రసాదించడానికి ప్రభుత్వాలు, నడుం బిగించాలి.  ఆరోగ్యమే ప్రధానమని తెలుసుకొని వివేకంతో, విచక్షణతో అడుగులు వేద్దాం,  నగరాలను ఆవాస ప్రదేశాలుగా పునర్‌‌‌‌‌‌‌‌ నిర్మించుకుందాం. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డా. బుర్ర మధుసూదన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి