కేంద్రం ఆదేశాలతో పనిచేస్తే.. ఢిల్లీలో ప్రభుత్వం ఎందుకు ? : సుప్రీంకోర్టు

కేంద్రం ఆదేశాలతో  పనిచేస్తే.. ఢిల్లీలో ప్రభుత్వం ఎందుకు ? : సుప్రీంకోర్టు
  • ఢిల్లీ విషయంలో కేంద్రం, ఆప్  గొడవపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, పిలుపుల మేరకు ఢిల్లీ ప్రభుత్వ అధికారులు పనిచేస్తే ఇక ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎందుకున్నట్లు అని కేంద్ర సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో విధులు నిర్వహించే ఆఫీసర్లందరూ తమ ప్రభుత్వ పరిధిలోకే వస్తారని, వారిపై తమకే ఆధిపత్యం ఉంటుందని కేంద్రం పేర్కొనడంపై సుప్రీంకోర్టు ఇలా స్పందించింది. ఢిల్లీలో పనిచేసే అధికారులు ఆలిండియా సర్వీసుకు చెందిన వారని, వారిపై అధికారం కేంద్రానికే ఉంటుందని కేంద్రం తరపున సొలిసిటర్  జనరల్  తుషార్  మెహతా వాదించారు. దీంతో సీజేఐ జస్టిస్  డీవై చంద్రచూడ్  ఆధ్వర్యంలోని జస్టిస్  ఎంఆర్ షా, జస్టిస్  కృష్ణమురారి, జస్టిస్  హిమ కోహ్లి, జస్టిస్  పీఎస్  నరసింహలతో కూడిన  బెంచ్.. మెహతా వాదనలపై స్పందించింది. ‘‘ఢిల్లీలో విధులు నిర్వహించే ఆఫీసర్లపై కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉన్నపుడు ఇక ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎందుకు? ఒక అధికారి తన విధులు సరిగా నిర్వహించకపోతే, ఆ ఆఫీసర్​ను ట్రాన్స్​ఫర్  చేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఉండదా?” అని బెంచ్  ప్రశ్నించింది.

మెహతా వాదనలు కొనసాగిస్తూ.. ‘కేంద్ర పాలిత ప్రాంతంలో నియమిులైన అధికారి.. పాలసీ డైరెక్షన్​కు సంబంధించి, అతని మంత్రికి బాధ్యులవుతారు. ఒకవేళ ఆ మంత్రి ఆదేశాల మేరకు ఆ అధికారి విధులు నిర్వహించకపోతే, అతడిని ట్రాన్స్ ఫర్  చేయాలని కోరే అధికారం మాత్రమే ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుంది. ఆ విషయాన్ని లెఫ్ట్ నెంట్  గవర్నర్​కు ఆ మంత్రి కచ్చితంగా తెలపాలి’ అని మెహతా చెప్పారు. బెంచ్  స్పందిస్తూ.. ‘‘యూటీలో పనిచేసే అధికారులపై ఫంక్షనల్  కంట్రోల్  ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుందని మీరు(కేంద్రం) అంటున్నారు. అటువంటపుడు ఏ శాఖలో ఎవరిని నియమించాలన్న అధికారం కూడా అదే ప్రభుత్వానికి ఉంటుంది కదా!”  అని వ్యాఖ్యానించింది. అనంతరం కేసును బెంచ్  ఈనెల 17కు వాయిదా వేసింది. కాగా, సర్వీసులపై ఢిల్లీ గవర్నమెంటుకు ఎలాంటి లెజిస్లేటివ్  అధికారాలు ఉండవని 2015 మే నెలలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ ను సవాల్  చేస్తూ ఢిల్లీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు నడుస్తోంది.