Ram Charan: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్ట్.. 'పెద్ది' షూటింగ్‌కు బ్రేక్.. ఏమైందంటే?

Ram Charan: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్ట్.. 'పెద్ది' షూటింగ్‌కు బ్రేక్.. ఏమైందంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,  దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'.  స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా నిఘా వర్గాలు తేల్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా ఆంక్షలు తీవ్రతరం కావడంతో దాని ప్రభావం సినీ పరిశ్రమపై పడింది.. 

ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్..

ఈ నెల 17న ( నవంబర్ ) ఢిల్లీలో పెద్ది సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కు ప్లాన్ చేశారు మేకర్స్.  ఇందుకోసం చిత్ర యూనిట్ చారిత్రక రెడ్ ఫోర్ట్ లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ అనుమతులు కూడా పొందింది. అయితే నగరంలో భద్రతా ఉద్రిక్తతలు పెరగడం, కట్టుదిట్టమైన నిబంధనల కారణంగా ఈ షెడ్యూల్ పూర్తిగా నిలిచిపోయింది. నిజానికి నవంబర్ 15, 16 తేదీల్లో కూడా షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ, ఆ ప్రణాళికలు కూడా రద్దు అయినట్లు సమాచారం. రామ్ చరణ్ లాంటి అగ్ర హీరో సినిమా షూటింగ్ రద్దు కావడం, ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ వంటి సున్నితమైన ప్రాంతంలో చిత్రీకరణకు అనుమతి లభించినా వాయిదా వేయడం.. అక్కడి పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది. పేలుడు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను ఉగ్రవాద చర్య గా ప్రకటించడంతో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి.

డబుల్ ఎఫెక్ట్

రామ్ చరణ్ సినిమా షూటింగ్ మాత్రమే కాదు.  బాలీవుడ్ ప్రముఖ చిత్రం 'కాక్‌టైల్ 2' (Cocktail 2) చిత్రీకరణ కూడా వాయిదా పడింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న,  షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఢిల్లీలో ఇటీవల పెరిగిన వాయు కాలుష్యం ఒక కారణంగా కాగా..  పేలుడు తరువాత నగరంలో నెలకొన్న అధిక ఉద్రిక్తత కూడా షూటింగ్‌ను వాయిదా వేయడానికి  ప్రధాన కారణమైంది. పాత ఢిల్లీ ప్రాంతంలో చిత్రీకరణ చేయాలనుకున్న చిత్ర యూనిట్, అభిమానుల భద్రత, స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ షెడ్యూల్ పూర్తిగా రద్దవలేదు. పరిస్థితులు మెరుగుపడితే, నెల చివరికల్లా కొత్త తేదీలను నిర్ణయించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. .

►ALSO READ | Rajamouli: SSMB29 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌కు భద్రత కట్టుదిట్టం.. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ!

ఢిల్లీ పేలుడుతో పాటు, తీవ్రమైన కాలుష్యం కూడా సినీ పరిశ్రమకు పెద్ద అడ్డంకిగా మారింది. ఈ అసాధారణ పరిస్థితులు సాధారణ జనజీవితంపైనే కాక, కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన సినీ నిర్మాణాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అభిమానులు మాత్రం తమ అభిమాన నటుల సినిమాల కోసం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.