Rajamouli: SSMB29 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌కు భద్రత కట్టుదిట్టం.. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ!

Rajamouli: SSMB29 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌కు భద్రత కట్టుదిట్టం.. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు,  దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం SSMB29. ఈ మూవీపై దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగానూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొదటి అధికారిక అప్‌డేట్‌ను నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో నిర్వహించే మెగా ఈవెంట్‌లో ప్రకటించనున్నారు. ఈ వేదికపైనే సినిమా టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేయనున్నారు.

అంచనాలు తారాస్థాయికి.. 

ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీలో మహేశ్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (మందాకినిగా) నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభగా) విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే శ్రుతీహాసన్ ఆలపించిన 'సంచారి సంచారి' పాటను రివీల్ చేసి, ఆ తర్వాత ప్రియాంక ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా, ప్రియాంక చోప్రా సారిలో గన్ పట్టుకుని యాక్షన్ మోడ్‌లో కనిపించిన 'మందాకిని' లుక్ సంచలనం సృష్టించింది. 

అభిమానులకు కీలక విజ్ఞప్తి

అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న  ఈ 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ కు  దాదాపు 50,000 మంది అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.  ఈ నేపథ్యంలో  దర్శకుడు రాజమౌళి స్వయంగా ఒక వీడియో ద్వారా కీలక సూచనలు చేశారు. పోలీసుల ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయని, అందరి భద్రత కోసమే ఈ చర్యలు తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు.

పాస్‌లు తప్పనిసరి..

ఇది బహిరంగ కార్యక్రమం కాదు. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని రాజమౌళి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికార ప్రకటనలు, ఆన్‌లైన్ పాస్‌లను నమ్మవద్దని ఆయన కోరారు. పాస్‌లపై ఉన్న క్యూఆర్‌ కోడ్ లోనే వేదికకు ఎలా చేరుకోవాలనే వివరాలు స్పష్టంగా ఉన్నాయని, వాటిని మాత్రమే పాటించాలని సూచించారు. అంతే కాదు మైనర్లుగా 18 సంవత్సరాల లోపు పిల్లలకు, అలాగే సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు దాటిన వారికి) అనుమతి లేదని పోలీసులు తెలియజేశారు. కాబట్టి వారు ఇంటి వద్దే ఉండి, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలని రాజమౌళి విజ్ఞప్తి చేశారు.

భద్రతకు తొలి ప్రాధాన్యం..

 ఇటీవలి సంఘటనల దృష్ట్యా భద్రతాపరమైన ఆంక్షలు పెంచామని, కార్యక్రమంలో చిన్న పొరపాటు జరిగినా రద్దు చేయాల్సి వస్తుందని కమిషనర్ చెప్పిన విషయాన్ని రాజమౌళి గుర్తు చేశారు. కాబట్టి అభిమానులు అధికారులకు సహకరించి, ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు. మహేశ్ బాబు ఫ్యాన్స్ , సినీ ప్రియులు ఈ 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌ను ఏ స్థాయిలో ఆదరించి, తమ అభిమానాన్ని క్రమశిక్షణతో ప్రదర్శిస్తారో చూడాలి. ఈ మెగా లాంచ్ ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా రాజమౌళి బృందం భారీ ఏర్పాట్లు చేస్తోంది.