దుబాయ్ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు

 దుబాయ్ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు

దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లు దుబాయ్ చేరుకున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి ఐపీఎల్-14 సీజన్ లోని సెకండ్ సేషన్ లీగ్ మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న ఆటగాళ్లు ఐదో టెస్టు అనూహ్యంగా రద్దవ్వడంతో అక్కడి నుంచి నేరుగా దుబాయ్‌ బాటపట్టారు. టీమ్‌ఇండియా ఆటగాళ్లందారూ ఇంగ్లండ్ నుంచి తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసిన విమానాల్లో దుబాయ్ కి చేరుకుంటున్నారు. ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, జస్ప్రిత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌ నిన్ననే ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి చేరుకోగా.. ఇవాళ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు దుబాయ్ చేరుకున్నారు.
ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రిషభ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అజింక్య రహానె, ఇషాంత్‌ శర్మ, అక్షర్‌ పటేల్‌, పృథ్వీషా, ఉమేశ్‌ యాదవ్‌ తదితరులు దుబాయిలో అడుగుపెట్టగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ విషయంలో దుబాయ్ లో కఠిన నిబంధనలు ఉండడంతో ఐపీఎల్ కు వచ్చిన ఆటగాళ్లంతా ఆరు రోజులు ప్రత్యేక క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తోంది. క్వారెంటైన్ పూర్తయిన తర్వాత వీరికి మరోసారి కరోనా టెస్టులు నిర్వహించి నెగటివ్ వస్తేనే తమ జట్లతో కలిసే వీలుంటుంది. 
ఐపీఎల్ కోసం వచ్చిన విదేశీ ఆటగాళ్లందరూ ఇప్పటికే దుబాయ్ చేరుకొని సీరియస్ గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బృందానికి ఈసారి కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా వచ్చి జట్టుతో కలిసిపోయాడు. గత ఏప్రిల్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచులో భుజం గాయం కారణంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ స్థానంలో అప్పుడు రిషభ్‌ పంత్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. డిల్లీ క్యాపిటల్స్  జట్టును పంత్ విజయ పథంలో నడిపించి టోర్నీ ఆగిపోయే నాటికి పాయింట్ల పట్టికలో జట్టును అగ్ర స్థానంలో నిలిపాడు.