ఢిల్లీ vs చెన్నై.. గెలుపెవరిది.?

ఢిల్లీ vs చెన్నై.. గెలుపెవరిది.?

 ఐపీఎల్ లో మరో ఆసక్తి సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం(మార్చి 31) పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 2024లో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల బలాబలాలేంటి..? గెలిచే అవకాశాలు ఆ జట్టుకు ఎక్కువగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. 

చెన్నై సూపర్ కింగ్స్ 

టోర్నీలో చెన్నై జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఇప్పటివరకు ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లో గెలిచి టేబుల్ టాపర్ గా  కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ జట్టుపై.. ఆ తర్వాత మ్యాచ్ లో గుజరాత్ జట్టుపై అలవోకగా విజయాలు సాధించింది. బ్యాటింగ్ లో చెన్నై జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఓపెనర్లు గైక్వాడ్, రచీన్ రవీంద్ర సూపర్ ఫామ్ లో ఉంటే.. మిడిల్ ఆర్డర్ లో దూబే, డారిల్ మిచెల్ అదరగొడుతున్నారు. చివర్లో జడేజా, ధోనీ ఇన్నింగ్స్ ఫినిషింగ్ చేయడానికి ఉండనే ఉన్నారు. సమీర్ రిజ్వి ఆడిన తొలి మ్యాచ్ లోనే ఆకట్టుకోవడం చెన్నై జట్టుకు అదనపు బలం. 

మరోవైపు బౌలింగ్ లోనూ చెన్నై బలంగా కనిపిస్తోంది. పతిరాణా, ముస్తఫిజుర్ రెహ్మాన్ రూపంలో ఇద్దరు విదేశీ పేసర్లు.. చాహర్, శార్దూల్ ఠాకూర్, తుషార్దేశ్ పాండే రూపంలో పేస్ బౌలింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా, తీక్షణ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉండడంతో చెన్నై అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తుంది. 

ఢిల్లీ క్యాపిటల్స్: 

ఐపీఎల్ 2024 సీజన్ లో ఢిల్లీ ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. పంత్ వచ్చినా.. క్యాపిటల్స్ కు వరుస పరాజయాలు తప్పడం లేదు. పంజాబ్, రాజస్థాన్ తో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. బ్యాటింగ్ లో వార్నర్ ఒక్కడే రాణిస్తున్నాడు. మార్ష్ మంచి ఆరంభాలు ఇస్తున్నా.. క్రీజ్ లో నిలదొక్కుకోలేకపోతున్నాడు. రికీ బుయి ఆడిన రెండు మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు. పంత్ పర్వాలేదనిపిస్తున్నా భారీ ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్నాడు. మిడిల్ ఆర్డర్ లో ఒక్కరు కూడ చెప్పుకోదగ్గ బ్యాటర్ లేకపోవడం ఢిల్లీకి పెద్ద మైనస్. బౌలింగ్ లో ఆశలు పెట్టుకున్న సౌతాఫ్రికా స్టార్ బౌలర్ అన్రిచ్ నోకియా ఆడిన తొలి మ్యాచ్ లోనే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ మినహాయిస్తే ఈ విభాగంలోనూ ఢిల్లీ బలహీనంగానే కనిపిస్తుంది. 

బలా బలాలను బట్టి చూస్తే ఢిల్లీ కన్నా.. అన్ని విభాగాల్లో చెన్నై పటిష్టంగా కనిపిస్తోంది. కానీ అనూహ్య ఫలితాలు వచ్చే టీ20 క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు. చెన్నై జట్టుకు 60 శాతం విజయవకాశాలుంటే..ఢిల్లీకి 40 శాతం ఉన్నాయి. మరి చెన్నై తన ఫామ్ కొనసాగించి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందో లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై కు షాక్ ఇచ్చి ఈ టోర్నీలో బోణీ కొడుతుందేమో చూడాలి. ఇరు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్ లో 29 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో ఢిల్లీ 10, చెన్నై 19  మ్యాచ్ ల్లో విజయం సాధించాయి.

జట్లు(అంచనా)

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్/పృథ్వీ షా, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్.