జెమీమా మెరుపులు..డబ్ల్యూపీఎల్‌‌లో ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కీలక విజయం

జెమీమా మెరుపులు..డబ్ల్యూపీఎల్‌‌లో ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కీలక విజయం
  • 29 రన్స్​ తేడాతో ముంబై ఓటమి
  • రాణించిన లానింగ్‌‌, షెఫాలీ

ఆల్‌‌రౌండ్‌‌ షోతో చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌.. డబ్ల్యూపీఎల్‌‌లో కీలక విజయాన్ని సాధించింది. జెమీమా రొడ్రిగ్స్‌‌ (33 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 69 నాటౌట్‌‌), కెప్టెన్‌‌ మెగ్‌‌ లానింగ్‌‌ (38 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 53) హాఫ్‌‌ సెంచరీలతో దంచికొట్టడంతో.. మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఢిల్లీ 29 రన్స్‌‌ తేడాతో ముంబై ఇండియన్స్‌‌ను ఓడించింది. టాస్‌‌ ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 192/4 స్కోరు చేసింది.  తర్వాత ముంబై 20 ఓవర్లలో 163/8 స్కోరుకే పరిమితమైంది. అమన్‌‌జోత్‌‌ కౌర్‌‌ (27 బాల్స్‌‌లో 7 ఫోర్లతో 42) టాప్‌‌ స్కోరర్‌‌. జెమీమాకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

‘టాప్‌‌’ లేపిన్రు

ఢిల్లీ ఇన్నింగ్స్‌‌లో టాప్‌‌ ఆర్డర్‌‌ చెలరేగింది. షెఫాలీ వర్మ (28), మెగ్‌‌ లానింగ్‌‌ మెరుపు ఆరంభాన్నిస్తే చివర్లో దాన్ని జెమీమా భారీ స్కోరుగా మలిచింది. ఇన్నింగ్స్‌‌ నాలుగో బాల్‌‌కే ఫోర్‌‌తో ఖాతా తెరిచిన షెఫాలీ ఉన్నంతసేపు దడదడలాడించింది. ఇస్మాయిల్‌‌ (1/46) బౌలింగ్‌‌లో వరుస సిక్సర్లతో రెచ్చిపోయింది. రెండో ఎండ్‌‌లో లానింగ్‌‌ కూడా బ్యాట్‌‌ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 

అయితే ఐదో ఓవర్‌‌లో షెఫాలీ ఔట్‌‌కావడంతో తొలి వికెట్‌‌కు 48 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఈ దశలో వచ్చిన అలీస్‌‌ క్యాప్సీ (19) కూడా వేగంగా ఆడింది. 8వ ఓవర్‌‌లో మూడు ఫోర్లు కొట్టి జోరు చూపెట్టినా 10వ ఓవర్‌‌లో మాథ్యూస్‌‌ దెబ్బకు క్లీన్‌‌ బౌల్డ్‌‌ అయ్యింది. దీంతో పవర్‌‌ప్లేలో 56/1 స్కోరు చేసిన ఢిల్లీ ఫస్ట్‌‌ టెన్‌‌లో 86/2 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి జెమీమా హవా మొదలైంది. 12వ ఓవర్‌‌లో లానింగ్‌‌ 4, 6, 4తో 20 రన్స్‌‌ దంచింది. 

13వ ఓవర్‌‌లో మరో ఫోర్‌‌ కొట్టి 36 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసింది. కానీ ఇదే ఓవర్‌‌ ఆఖరి బాల్‌‌కు ఔట్‌‌కావడంతో మూడో వికెట్‌‌కు  35 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. మారిజానె కాప్‌‌ (11)తో కలిసిన జెమీమా ఒక్కసారిగా చెలరేగిపోయింది. 14, 15 ఓవర్లలో 9 రన్స్‌‌ చేసినా 16వ ఓవర్‌‌లో మూడు, తర్వాతి ఓవర్‌‌లో మరో రెండు ఫోర్లు బాదింది. 18వ ఓవర్‌‌లో కాప్‌‌ ఔట్‌‌ కావడంతో నాలుగో వికెట్‌‌కు 37 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. చివర్లో జొనాసెన్‌‌ (4 నాటౌట్‌‌) అండగా జెమీమా రెండు ఫోర్లు, ఆ వెంటనే 4, 6, 6, 6, 4 దంచింది. ఈ క్రమంలో 27 బాల్స్‌‌లో ఫిఫ్టీ కొట్టి ఐదో వికెట్‌‌కు 47 (16 బాల్స్‌‌) రన్స్‌‌ జత చేసింది. 

బౌలర్లు అదుర్స్‌‌..

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బలమైన ముంబై బ్యాటర్లను డీసీ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. హేలీ మాథ్యూస్‌‌ (29)ను నిలబెట్టి రెండో ఎండ్‌‌లో వరుస విరామాల్లో వికెట్లు తీశారు. యాస్తిక భాటియా (6), బ్రంట్‌‌ (5), హర్మన్‌‌ప్రీత్‌‌ (6), అమెలియా కెర్‌‌ (17) తక్కువ స్కోరుకే ఔట్‌‌ కావడంతో ముంబై 10 ఓవర్ల లోపే 68 రన్స్‌‌కే 5 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది. 

ఈ దశలో అమన్‌‌జోత్‌‌ కౌర్‌‌, పూజా వస్త్రాకర్‌‌ (17) ఇన్నింగ్స్‌‌ను ఆదుకునే ప్రయత్నం చేయడంతో 15 ఓవర్లలో స్కోరు 116/5గా మారింది. కానీ 16వ ఓవర్‌‌ తొలి బాల్‌‌కే అమన్‌‌జోత్​ ఔట్‌‌కావడంతో ఆరో వికెట్‌‌కు 48 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. చివర్లో సాజన (24 నాటౌట్‌‌) వేగంగా ఆడినా చేయాల్సిన రన్‌‌రేట్‌‌ పెరిగిపోవటంతో టార్గెట్‌‌ను అందుకోలేకపోయారు. జొనాసెన్‌‌ 3, కాప్‌‌ 2 వికెట్లు తీసింది.