
- భారీ భద్రత మధ్య ఢిల్లీ సీఎం ఇంటికి
- 12 మంది ఆఫీసర్ల బృందం
- అర్వింద్, ఆయన భార్య ఫోన్లు స్వాధీనం
- రెండు ట్యాబ్స్, ఒక ల్యాప్ టాప్ నుంచి
- డేటా ట్రాన్స్ ఫర్ చేసుకున్న అధికారులు
- పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి సీఎం
- ఈడీకి వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల నిరసన
- వారిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి భారీ భద్రతా బలగాల మధ్య 12 మంది ఈడీ అధికారులు సీఎం ఇంటికి చేరుకున్నారు. సెర్చ్ వారంట్ చూపించి ఆయనను కొంతసేపు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు.
శుక్రవారం కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం కస్టడీలోకి తీసుకుంటామని ఈడీ అధికారులు తెలిపారు. అంతకుముందు కేజ్రీవాల్ ఫోన్లతో పాటు ఆయన భార్య ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు ట్యాబ్స్, ఒక ల్యాప్ టాప్ నుంచి డేటాను ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. అధికారులు సీఎం ఇంట్లో ఉన్నంత సేపు ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆయన ఇంటి బయట కాపలా ఉన్నారు.
సీఎం ఇంటి పరిసరాల్లో నిషేధాజ్ఞలు జారీచేశారు. కాగా, సీఎం ఇంటికి ఈడీ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకుని ఆప్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేసి తీసుకెళ్తుండగా ఈడీ అధికారులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పదవిలో ఉండి అరెస్టయిన మొదటి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అర్వింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినా ఆయనే తమ సీఎం అని ఆప్ మంత్రి అతీషి అన్నారు. సీఎం నివా సం బయట మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారని మాకు సమాచారం అందింది. ఇదంతా బీజేపీ, ప్రధాని మోదీ కుట్ర. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసని చెబుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండేండ్ల క్రితం దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ, సీబీఐలను ఆప్ నేతల ఇండ్ల మీదికి వెయ్యిసార్లు ఉసిగొల్పింది. కానీ, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయారు.
లోక్ సభకు ఎన్నికల ముందు కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం నిజంగా కుట్రే. అరెస్టయినా ఆయనే మా సీఎం. అవసరమైతే జైలు నుంచి కూడా ఆయన పరిపాలిస్తారు. ఏ చట్టం కూడా ఆయనను ఆపలేదు” అని అతీషి పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ దోషిగా తేలలేదని ఆమె చెప్పారు. ఈడీ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలిపారు. కాగా, కేజ్రీవాల్ అరెస్టును సవాలు చేస్తూ అత్యవసరంగా విచారణ జరపాలని ఆప్ లీడర్లు కోరగా సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు. శుక్రవారం వారి పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. అలాగే కేజ్రీవాల్ తరపు లాయర్ కూడా ఆయన అరెస్టుపై పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైనా శుక్రవారం విచారణ జరగనుంది.
కవిత తర్వాత కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను ఈడీ అధికారులు అరెస్టు చేసి వారం రోజులు కూడా కాకముందే అర్వింద్ కేజ్రీవాల్‌ను సైతం అరెస్టు చేశారు. కవిత అరెస్టు తర్వాత ఈ కేసులో ఆయనను మొదటిసారిగా అధికారులు కుట్రదారుగా పేర్కొన్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నిరుడు అక్టోబర్‌లో ఈడీ అధికారులు ఆయనకు మొదటిసారిగా సమన్లు జారీచేశారు.
కానీ ఆయన గైర్హాజరయ్యారు. అనంతరం నవంబర్ 2న మరోసారి సమన్లు పంపినా ఆయన రాలేదు. దీంతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవచ్చని అప్పుడు ప్రచారం జరిగింది. కానీ, అధికారులు అరెస్టు చేయలేదు. ఇలా 9సార్లు ఆయనకు సమన్లు పంపారు. తొమ్మిదోసారి కూడా ఈడీ సమన్లను కేజ్రీవాల్ లెక్కచేయలేదు. దీంతో అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అంతకుముందు నిరుడు ఫిబ్రవరిలో ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను జైలుకు తరలించారు. అక్టోబర్‌లో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. ఈడీ పలుమార్లు దాఖలు చేసిన చార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరు ఉంది.
అరెస్టు కాకుండా ప్రొటెక్షన్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
ఈడీ అరెస్టు చేయకుండా ప్రొటెక్షన్ ఇవ్వలేమని అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్ తాజాగా వేసిన పిటిషన్‌కు రిప్లై ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మేము (హైకోర్టు) ఈడీ వాదనలు, కేజ్రీవాల్ వాదనలు విన్నాం. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్‌కు ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆదేశించలేం. అయితే, రిప్లై ఫైల్ చేసే స్వేచ్ఛ ప్రతివాదికి ఉంది” అని జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్ ల బెంచ్ పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఏమన్నా సాక్ష్యాధారాలు ఉంటే చూపాలని ఈడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది.
కేజ్రీవాల్ టైమ్ అయిపోయింది: కేంద్రం
కేజ్రీవాల్ కావాలనే విచారణకు డుమ్మా కొడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అన్నారు. కేంద్రం తరపున ఆయన వాదనలు వినిపించారు. ఇప్పటికే కేజ్రీవాల్ కు ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు పంపిందని, ఆయన టైమ్ అయిపోయిందని రాజు పేర్కొన్నారు. ఈడీ సమన్లు చట్టవ్యతిరేకం అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
అరెస్టు అన్యాయం: ప్రియాంక
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ నేత ప్రియాంకా వాద్రా అన్నారు. రాజకీయాలను దిగజార్చడం ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి తగదని ఆమె ట్వీట్ చేశారు.
లిక్కర్ కేసు పూర్వాపరాలు
2021 నవంబర్ 7: సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని అమలు చేసింది.
2022 జులై 8: ఈ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రట రీ నరేష్ కుమార్ అప్పటి ఎల్జీ వీకే సక్సేనాకు ఫిర్యాదు చేశారు.
2022 జులై 22: సీఎస్ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తుకు వీకే సక్సేనా సిఫారసు చేశారు.
2022 జులై 31: కొత్త విధానాన్ని ఆప్ సర్కారు ఉపసంహరించుకుంది.
2022 ఆగస్ట్ 17: 15 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
2022 ఆగస్ట్ 19: మనీష్ సిసోడియా, మరో ముగ్గురి ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీ చేశారు.
2022 ఆగస్ట్ 22: లిక్కర్ పాలసీపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
2022 సెప్టెంబర్: ఆప్ కమ్యూనికేషన్ల చీఫ్ విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసింది.
2023 మార్చి: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్టు చేసింది.
2023 అక్టోబర్: ఆప్ లీడర్ సంజయ్ సింగ్‌ను కూడా ఈడీ అరెస్ట చేసింది.
2023 అక్టోబర్: కేజ్రీవాల్ కు ఈడీ రెండుసార్లు సమన్లు పంపింది.
2024 మార్చి 16: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది.
2024 మార్చి 21: తాజాగా కేజ్రీవాల్‌ను కూడా ఈడీ అరెస్టు చేసింది.