కేజ్రీవాల్ అరెస్ట్ కరక్టే..కేసులో తగిన ఆధారాలున్నయ్.. : ఢిల్లీ హైకోర్టు

కేజ్రీవాల్ అరెస్ట్ కరక్టే..కేసులో తగిన ఆధారాలున్నయ్.. : ఢిల్లీ హైకోర్టు
  • సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులుండవ్
  • తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం వేసిన పిటిషన్ కొట్టివేత 
  • విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు 
  • ఈడీ చర్యలన్నీ సబబేనని కామెంట్

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌‌‌కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని.. ఆయన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేసింది. 

ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌‌‌‌ను ఈడీ అరెస్టు చేసింది. ఏప్రిల్ 1న ట్రయల్ కోర్టులో హాజరుపరచగా..ఆయనను ఏప్రిల్ 15 వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. దాంతో కేజ్రీవాల్  ప్రస్తుతం తీహార్  జైలులో ఉన్నారు. అక్కడి నుంచి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌‌‌‌ చేశారు. అరెస్ట్ చేసి, రిమాండ్ చేయడం చట్ట విరుద్ధమని తన పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ  బెంచ్ మంగళవారం తీర్పును ప్రకటించారు. 25 నిమిషాల పాటు తీర్పును చదివిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ.. కేజ్రీవాల్ అరెస్టుకు దారితీసిన ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయని వివరించారు. 

సీఎంకు ప్రత్యేక హక్కులుండవ్.. 

తీర్పు సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. " సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు. వర్చువల్ గా విచారణ జరపాలని కోరడం కరక్ట్ కాదు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు" అని ఘాటుగా  వ్యాఖ్యానించింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ నేరుగా పాల్గొన్నట్లు  ఈడీ సమర్పించిన ఆధారాలు తెలియజేస్తున్నాయని తెలిపింది. 

లోక్ సభ ఎన్నికల కారణంగానే కేజ్రీవాల్‌‌‌‌ను అరెస్టు చేశారన్న వాదనలపై స్పందిస్తూ.. తాము రాజ్యాంగ పరమైన, చట్ట విరుద్ధమైన అంశాలనే పరిగణనలోకి తీసుకుంటామని, రాజకీయపరమైన నైతిక అంశాలను కాదని స్పష్టం చేసింది. ఈ వివాదం కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ సీఎంకు మధ్య కాదని.. కేజ్రీవాల్‌‌‌‌కు, ఈడీకి మధ్య మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తులకు బాధ్యతలు ఉంటాయని చెప్పిన కోర్టు.. ఈ కేసు విషయంలో తమపై బాహ్య లేదా రాజకీయ కారణాల ప్రభావం లేదని తేల్చిచెప్పింది. 

హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని న్యాయస్థానం పేర్కొంది. కాబట్టి ఆధారాల ప్రకారం చూస్తే.. కేజ్రీవాల్ పట్ల ఈడీ తీసుకున్న చర్యలన్ని కరెక్టేనని పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని.. అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

'జైల్ కా జవాబ్ వోట్ సే' పేరిట ప్రచారం

జైలులో ఉన్న కేజ్రీవాల్‌‌‌‌కు ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా మద్దతు తెలపాలని ప్రజలను ఆప్ నేతలు కోరారు. “జైల్ కా జవాబ్ వోట్ సే” పేరిట ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ మంగళవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఢిల్లీలోని షహదారాలో తూర్పు ఢిల్లీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. వచ్చే ఎన్నికల్లో ఆప్​కు ఓటు వేయాలని అభ్యర్థించారు.

సుప్రీంకోర్టుకెళ్తం 


ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం. మద్యం పాలసీ కేసు అనేది ఆమ్​ ఆద్మీ పార్టీని, మా నేతలను అణిచివేసేందుకు చేసిన పెద్ద రాజకీయ కుట్ర. ఢిల్లీ హైకోర్టు తీర్పును గౌరవిస్తాం.. కాకపోతే, ఈ తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదు.  అందువల్ల, ఈ తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తం. ఆప్​ ఎంపీ సంజయ్ సింగ్​కు సుప్రీంకోర్టులో ఉపశమనం కలిగినట్లుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​కు కూడా ఈ కేసులో రిలీఫ్ లభిస్తుందని మా విశ్వాసం. సుప్రీంకోర్టుపై మాకు పూర్తి నమ్మకం ఉంది.           

 -- సౌరభ్ భరద్వాజ్