ఛాన్స్ ఇస్తే ఢిల్లీని క్లీన్ చేస్త: కేజ్రీవాల్

ఛాన్స్ ఇస్తే ఢిల్లీని క్లీన్ చేస్త: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే, ఢిల్లీ సిటీని క్లీన్ చేస్తానని ఆప్ చీఫ్​, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఎంసీడీ ఎన్నికల్లో తమ పార్టీ 230 కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తుందని, బీజేపీకి 20 సీట్లకు మించి రావని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల ప్రచారానికి కేంద్ర మంత్రులు, సీఎంలను బీజేపీ నేతలు రప్పిస్తున్నారని, కార్పొరేషన్ లో వారు (బీజేపీ) సరిగ్గా పనిచేసుంటే, అంత మంది నేతలు రావాల్సిన అవసరం వచ్చేది కాదని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం ఆప్ నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో స్థానికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 

వచ్చే నెల 4న జరిగే ఎంసీడీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. ‘మేము మంచినీటి కోసం వ్యవస్థను ఏర్పాట్లుచేసి నీరందిస్తున్నం. అలాగే చెత్తను కూడా తొలగిస్తం. ఒక్క చాన్స్ ఇస్తే, ఇంతకుముందెన్నడూ లేనంతగా సిటీని శుభ్రం చేస్త. ఢిల్లీ మెరిసిపోయేలా చేస్త’ అని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.  మీలో (పౌరులు) ఉత్సాహం చూస్తుంటే ఆప్​కు 230 కన్నా ఎక్కువ సీట్లు వచ్చేలా ఉన్నాయన్నారు. ఎంసీడీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, పీయూష్​ గోయల్ తోపాటు బీజేపీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు పాల్గొనడంపై ఆయన స్పందించారు. వారికి తనను తిట్టడం తప్ప వేరే పనేమీలేదని ఫైరయ్యారు. ఢిల్లీ ప్రభుత్వంలో తాము ఏం చేశామో చెప్పుకోగలుగుతున్నామని, కానీ ఎంసీడీలో బీజేపీ ఏం చేసిందో ప్రచారం చేసుకునే ధైర్యం ఆ పార్టీ నేతలకు లేదని విమర్శించారు.